ఏపీ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. విపక్షంలో ఉన్న వైసీపీ బురద జల్లేందుకు ఎప్పటికప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్న కూడా కూటమి ప్రభుత్వం సైలెంట్ గా పని చేసుకుంటూ పోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇక తాజాగా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని దివ్యాంగులకు ఫ్రీగా స్కూటీ అందించాలని భావిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రతిపాధనలు రెడీ చేసే ఆర్థిక శాఖకు నివేదించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే 100 శాతం రాయితీతో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించేందుకు తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు.
2024-25 ఏడాదికి గాను.. నియోజకవర్గానికి పదిమంది చొప్పున 1750 మంది దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం త్రిచక్ర వాహనాలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వాహనాల పంపిణీ షురూ చేస్తారు. ఒక్కో వాహనం ధర రూ. లక్ష వేసుకున్నా.. మొత్తం వాహనాల పంపిణీకి రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, గత వైసీపీ ప్రభుత్వం కేవలం ఒక్కసారి మాత్రమే దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసింది. అది కూడా 4 వేల మంది దరఖాస్తు చేసుకుంటే 1,750 మందికి వాహణాలు ఇచ్చారు. కానీ కూటమి సర్కార్ ప్రతి ఏడాది అర్హులైన వారికి ఉచితంగా స్కూటీలు ఇవ్వాలని భావిస్తోంది.