తన పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత, నేటి అధికార పక్ష నేత జగన్ ఎన్నో హామీలను గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఏపీలో సామాజిక పెన్షన్లతో పాటు లబ్ధిదారులకు అందే నగదును పెంచుకుంటూ……..పోతామని జగన్ సాగదీసి మరీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మాట తప్పను…మడమ తిప్పను అని చెప్పే జగన్…నిజంగా ఆ మాట నిలబెట్టుకున్నారు.
ఏవి పెంచుకుంటూ పోతేనేం…పెంచుకుంటూ పోతే చాలు…జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లుందని భావించిన జగన్…జనాలకు షాకులు మీద షాకులిస్తున్న వైనం చర్చనీయాంశమైంది. అసలు లెక్క ప్రకారం, ఇచ్చిన మాటకు కట్టుబడి….పెన్షన్ల వంటివి పెంచుకుంటూ పోవాల్సిన జగన్….రివర్స్ లో వస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, చెత్తపై పన్నులు పెంచుకుంటూ….పోతూ జనం నడ్డి విరుస్తున్న జగన్ పై విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఫైబర్ నెట్ చార్జీలను జగన్ పెంచిన వైనంపై జనం మండిపడుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో రూ.235 ఉన్న ధరను రూ.300 కు పెంచిన జగన్…తాజాగా దానిని రూ.350కు పెంచుకుంటూ…..పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఫైబర్‌నెట్ నెలవారీ ఛార్జీలను సెప్టెంబరు నుంచి రూ.300 నుంచి 350 లకు పెంచుతున్నట్లు ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ప్రకటించారు.
ఇంటర్నెట్ వేగాన్ని 15 నుంచి 20 ఎంబీపీఎస్‌కు, డౌన్లోడ్ లిమిట్‌ను 100 జీబీ నుంచి 150 జీబీకి పెంచుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అదనంగా 10 లక్షల కనెక్షన్లను ఇస్తామని, ప్రస్తుతం అందిస్తున్న ఛానల్స్‌తో పాటు మరో 10 హెచ్డీ ఛానల్స్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలందించే పైలట్ ప్రాజెక్టును త్వరలోనే విజయవాడ నగరంలో ప్రారంభిస్తామని, కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ కావాలనుకునే వారికి రూ.197 ప్యాకేజీ ప్రారంభిస్తామని చెప్పారు. రూ.15 కోట్ల అక్రమాలకు పాల్పడిన టెరా సాఫ్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు.