- లక్షా 500 కోట్ల రుణాలు దాచిన వైనం
- ఈ రెండేళ్లలో 60 వేల కోట్ల గ్యారెంటీలు
- బడ్జెట్ పుస్తకాల్లో చూపనివి రూ.21,500 కోట్లు
- ఎఫ్ఆర్బీఎం పరిమితిపైనా దొంగ లెక్కలు
- మూడు శాతానికి మించి రుణాలు
- ఈపీఎఫ్, నాబార్డు, హడ్కోల నుంచి
- తెచ్చే అప్పులపై మాత్రం గప్చుప్
- కేంద్రం, ఆర్బీఐ ఆగ్రహం
- బహిరంగ మార్కెట్ రుణపరిమితిలో కోత
- 27 వేల కోట్లు తీసుకోవడానికే అనుమతి
- 3,470 కోట్లు జమచేసుకున్న ఆర్బీఐ
- జీతాలు, పెన్షన్ల చెల్లింపు బంద్
వంద కోట్లు కాదు.. వెయ్యి కోట్లు కాదు.. రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అదనంగా మొత్తం రూ.1,05,500 కోట్ల అప్పులు చేసేసింది. ద్రవ్య నియత్రణ బడ్జెట్ నిర్వహణ ‘ఎఫ్ఆర్బీఎం) చట్ట పరిధిని దాటి దొరికిన చోటల్లా అప్పులు తేవడం.. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వాల కళ్లకు గంతలు కట్టడం.. బడ్జెట్ పుస్తకాల్లో అప్పుల వివరాలు చెప్పకుండా దాచడం.. ఇదీ జగన్ సర్కారు తీరు!
ఆంధ్రప్రదేశ్ రుణగ్రస్థంగా మారి.. ఆర్థికంగా కుప్పకూలవచ్చన్న అనుమానంతో.. గత మూడేళ్లలో చేసిన అప్పుల వివరాలు పంపాలని కేంద్రం, ఆర్బీఐ తాజాగా లేఖలు రాస్తే.. తన నిర్వాకాలను దాచి.. టీడీపీ హయాంలో ఉల్లంఘనలు జరిగినట్లు చెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం.
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రెండేళ్ల కింద టీడీపీ ప్రభుత్వం దిగిపోయేవరకు ఇచ్చిన గ్యారెంటీల విలువ రూ.60 వేల కోట్లు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఇచ్చిన గ్యారెంటీలు కూడా రూ.60 వేల కోట్లే.
అయితే ఇందులో ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ పుస్తకాల్లో చూపకుండా దాచిపెట్టిన గ్యారెంటీలు రూ.21,500 కోట్లు. ఈ మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికే రూ.18,500 కోట్ల అప్పు తెచ్చి వాడడం కూడా జరిగిపోయింది.
అయినా ఆ పుస్తకాల్లో ఆర్థిక శాఖ వీటి గురించి ప్రస్తావించలేదు. అంతమాత్రాన చెల్లించాల్సిన అసలు, వడ్డీలు ఆగిపోవు కదా! గత మూడేళ్ల నుంచి రాష్ట్రప్రభుత్వం అప్పులు, గ్యారెంటీల కింద మొత్తంగా లక్షా 500 కోట్ల రూపాయలను రుణాలు తెచ్చినట్లు తేలింది.
అప్పులు, గ్యారెంటీలను ఒకపక్క దాచిపెడుతూనే కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతిని వాడుకునే విషయంలోనూ జగన్ ప్రభుత్వం అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతం మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం ఉంది. ఇదే దవ్య జవాబుదారీ-బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం.
ఉదాహరణకు.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆ 3 శాతం కింద రూ.42 వేల కోట్ల అప్పునకు అనుమతి వచ్చింది. అంటే రాష్ట్రప్రభుత్వం చేసే ఏ అప్పైనా ఆ పరిమితికి లోబడే ఉండాలి. కానీ ఆర్థిక శాఖ ఏం చేస్తోందంటే.. ఆ 3 శాతం మొత్తాన్ని ఆర్బీఐ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి సమీకరిస్తోంది.
ఇవి కాకుండా ఉద్యోగుల ఈపీఎఫ్ నిధులు, నాబార్డు, హడ్కో, ఈఏపీ ప్రాజెక్టుల రుణాలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులను ఈ 3 శాతం పరిధిలోకి తీసుకు రావడం లేదు.
ఈ మార్గాల ద్వారా ఆర్థిక శాఖ చేస్తున్న అప్పు సగటున ఏడాదికి రూ.9,000 కోట్లు ఉంటోంది. అంటే ఆ రూ.42 వేల కోట్ల నుంచి రూ.9,000 కోట్లు తీసేసి మిగిలిన రూ.33 వేల కోట్లు మాత్రమే ఆర్బీఐ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించాలి. గత రెండేళ్ల నుంచి ఆర్థిక శాఖ ఈ నిబంధనను అస్సలు అమలు చేయడం లేదు.
ఈ రెండేళ్ల ఆనవాయితేనే ఈ ఏడాది కొనసాగిస్తే దీంతో అప్పులు రూ.51,000 కోట్లకు చేరుకుంటాయి. ఇలాగే.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.32,000 కోట్లకు అనుమతిస్తే ఆర్థిక శాఖ రూ.41,000 కోట్లు అప్పు చేసింది. కానీ, ఆర్బీఐ ద్వారా చేసిన రూ32,000 కోట్లనే లెక్కల్లో చూపిస్తుంది.
మిగిలిన రూ.9,000 కోట్ల లెక్కలను దాచేసింది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టానికి విరుద్ధం. అంటే రాష్ట్రానికి తలకు మించిన భారం.
అడిగిందొకటి.. ఇచ్చిందొకటి..
మూడేళ్ల అప్పుల లెక్కలు పంపాలని అడిగితే… టీడీపీ హయాంలోని చివరి రెండేళ్ల లెక్కలు, వైసీపీ ప్రభుత్వంలోని మొదటి సంవత్సరం లెక్కలను ఆర్థిక శాఖ కేంద్రానికి, ఆర్బీఐకి పంపింది.
గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) లెక్కలను పూర్తిగా దాచిపెట్టి ఇంకా అకౌంట్స్ సర్దుబాటు కాలేదని తప్పించుకుంది. పోనీ ఇచ్చిన ఆ ఒక్క సంవత్పసరం లెక్కలైనా ఉన్నవి ఉన్నట్లు పంపారా అంటే అదీ లేదు. ఓపెన్ మార్కెట్ బారోయింగ్ (ఓఎంబీ) పరిమితిని దాటి గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో సగటున రూ.9,000 కోట్లు అధికంగా అప్పులు తేగా.. వైసీపీ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో కేవలం రూ.3,000 కోట్లే అధికంగా వాడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చింది.
గ్యారెంటీలు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ద్వారా తెచ్చిన రూ.60 వేల కోట్లు, రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) నుంచి తెచ్చిన రూ.18,500 కోట్ల అప్పుల వివరాలను మచ్చుకైనా అందులో ప్రస్తావించలేదు.
కేంద్రం, ఆర్బీఐ షాక్
దొంగ లెక్కలు చెప్పిన జగన్ సర్కారుకు కేంద్రం షాకిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్లో రుణ సమీకరణ పరిమితిలో భారీగా కోతపెట్టింది. రూ.27,668 కోట్లకు మించి సేకరించడానికి వీల్లేదంటూ తాఖీదు పంపింది.
ఓ వైపు రుణ పరిమితి పెంచాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తరుణంలోనే ఇలా కోతపెట్టడం గమనార్హం.
ఆర్బీఐ కూడా గట్టి షాకే ఇచ్చింది. అధిక వడ్డీకి రాష్ట్రప్రభుత్వం రుణంగా తీసుకున్న రూ.2 వేల కోట్లను, రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఇచ్చిన రూ.1,470 కోట్లను ఓవర్డ్రాఫ్టు (ఓడీ) బకాయి కింద జమచేసుకుంది.
ఈ రూ.3,470 కోట్లు చేతికి వస్తే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లు చెల్లింపులు చేయాలనుకున్న జగన్ సర్కారు బిత్తరపోయింది. అయినా ఇంకా రూ.800 కోట్లు ఓడీ కింద బకాయిలు ఉన్నాయి. రేపు అప్పు తీసుకున్నా.. ఈ మొత్తాన్ని మినహాయించుకుంటుంది.
ఓవర్ డ్రాఫ్టు ఖాతాలో తెచ్చుకున్న రుణాన్ని ఏ రాష్ట్రప్రభుత్వమైనా సకాలంలో చెల్లించాల్సిందే. లేదంటే ఆర్బీఐ ఊరుకోదు. కాసులవేటలో పడిన జగన్ యంత్రాంగం ఈ విషయాన్ని విస్మరించడంతో మొదటికే మోసం వచ్చింది.
దీంతో జీతాలు, పెన్షన్లను ఎలా సర్దుబాటు చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మళ్లీ ఓడీకి వెళ్లే అవకాశమున్నా.. వచ్చేదాంట్లో ఆర్బీఐ జమ చేసుకుంటే వేతనాలిచ్చే పరిస్థితి ఉండదు.
పైగా ఓడీ రూ.1,400 కోట్లకుపైన తీసుకుంటే నాలుగు రోజుల్లో.. అంతకంటే తక్కువ తీసుకుంటే రెండు వారాల్లో చెల్లించాలి. నాలుగు రోజుల్లో రాష్ట్రానికి అంత సొమ్ము వచ్చే అవకాశం లేదు.
ఖజానాలో అది జమ కాకుంటే ఆర్థికంగా దివాలా తీసినట్లవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.