`ఎలా గెలుద్దాం.. ఏం చేద్దాం..`- ఏపీలో కీలక పార్టీల వ్యూహాలు ఇలానే ఉన్నాయి. మరో ఆరు మాసాల్లోనే ఎన్నికలు ఉండడంతో గెలుపు గుర్రం ఎక్కి అధికారం చేజిక్కించుకోవడం.. రెండు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. తాను చేసిన శపథం మేరకు.. అధికారం చేపట్టడం..టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత కీలకంగా మారింది. మరోసారి సీఎం అయ్యాకే తాను అసెంబ్లీలో కి అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. ఇప్పుడు ఈ శపథాన్ని నెరవేర్చుకునేందుకు మరో ఆరు మాసాలే గడువుంది.
ఇక, వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుంటే చాలు. మళ్లీ పాతికేళ్ల వరకు తమకు తిరుగులేదని.. వైసీపీ అధినేత పదే పదే చెబుతున్నారు. “వచ్చే ఎన్నికలు ఒక్కటే కీలకం. ఆ ఎన్నికలు గెలిస్తే.. ఇక, మనం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు“ అని సీఎం జగన్ తన పార్టీ నాయకులకు అనేక సార్లు చెప్పారు. అంటే.. మొత్తంగా వైసీపీ అధినేత లక్ష్యం చేరాలన్నా.. ఆయనకు మిగిలింది కూడా ఆరు మాసాలే గడువు.
దీంతో ఇప్పుడు ఎన్నికలగెలుపు మంత్రంపై ఇరు పక్షాలు కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయ ని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకుంటే.. ఆయన ఏపీలో ఉన్నా.. హైదరాబాద్లో ఉన్నా.. ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే నియోజవకర్గం టికెట్లను ఖరారు చేయడంపై దృష్టి పెట్టారు. అదేసమయంలో మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు.. తన బస్సు యాత్రలు, పల్లె నిద్రలకు పదును పెంచుతున్నారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. సీఎం జగన్ కూడా.. ఒకవైపు పాలనను ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు వ్యూహా లకు పదును పెంచుతున్నారు. గతానికి భిన్నంగా ఆయన స్పాంటేనియెస్గా స్పందిస్తున్నారు. ప్రధానం గా తాను విశ్వసిస్తున్న ఓటు బ్యాంకును కదలకుండా చూసుకోవడం తోపాటు.. కొత్త ఓటు బ్యాంకును కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు.. వచ్చే ఎన్నికల నాటికి మేనిఫెస్టోలో మిగిలిన అంశాలపైనా దృష్టి పెట్టినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ఎన్నికల వ్యూహాలకు రెండు ప్రధాన పార్టీలు కూడా పదును పెంచాయనేది వాస్తవం అంటున్నారు.