గుజరాత్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ (హెరాయిన్) ను స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. అయితే.. ఇందులో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ విపక్ష నేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ తో పాటు.. వారి వ్యాఖ్యల్ని పబ్లిష్ చేసిన ఈనాడు.. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు కలిపి తాజాగా ఏపీ డీజీపీ కార్యాలయం లీగల్ నోటీసుల్ని జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.
ఏపీకి సంబంధం లేకున్నా.. అసత్య ఆరోపణలు చేయటం.. ప్రజల్ని తప్పుదారి పట్టించటంతో పాటు ఏపీ ప్రతిష్టను దెబ్బ తీసేలా చేశారంటూ వారికి తాజాగా లీగల్ నోటీసులు జారీ చేశారు.
పలు కథనాలతో పాటు.. జగన్ పాలనలో రాష్ట్రంలో 20 ఏళ్లు వెనక్కి.. డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు.. దీనికి జగన్.. డీజీపీ ఏమని బదులిస్తారు.. లాంటి శీర్షికలతో పబ్లిస్ చేసిన కథనాలపై డీజీపీ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇలా తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించిన వైనంపై లీగల్ నోటీసులు పంపి.. సమాధానాలు పంపాలని పేర్కొన్నారు. ఇక.. తాజాగా నోటీసులు పంపిన వారికి సంబంధించి చూస్తే.. మరీ ఇంత మందా? అన్న సందేహం కలుగక మానదు.
లీగల్ నోటీసుల్ని ఎవరెవరికి పంపారన్నది చూస్తే.. తొలుత టీడీపీ నేతల విషయానికి వస్తే..
- చంద్రబాబు
- లోకేశ్
- ధూళిపాళ్ల నరేంద్ర
- కింజరావు రామ్మోహన్ నాయుడు
- బొండా ఉమ
- బుద్దా వెంకన్న
- కొమ్మారరెడ్డి పట్టాభి
మీడియా సంస్థలకు సంబంధించి నోటీసులు ఎవరెవరికి పంపారంటే..
ఈనాడు
– రామోజీరావు
– కిరణ్ (రామోజీ వాళ్ల అబ్బాయి)
– ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు
– పత్రిక బ్యూరో చీఫ్
ఆంధ్రజ్యోతి
– రాధాక్ఱిష్ణ
– కోగంటి వెంకట శేషగిరిరావు (పబ్లిషర్)
– ఎడిటర్ కె. శ్రీనివాస్
– పత్రిక బ్యూరో చీఫ్
నోటీసుల్లో ఏముంది?
పెద్ద ఎత్తున నోటీసులు పంపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందులో ఏమని పేర్కొన్నారన్న విషయాన్ని చూస్తే.. ‘‘డీఆర్ఐ గుజరాత్లో స్వాధీనం చేసుకున్న రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసు శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా అసత్య ఆరోపణలు చేశారు’’ అని పేర్కొన్నారు.
ఈ హెరాయిన్ తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించినా.. డీజీపీ క్లారిటీగా చెప్పినా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారు. ఇలాంటి చర్యలతో ప్రజలు తప్పుదోవ పట్టించినందుకే నోటీసులు పంపినట్లుగా పేర్కొన్నారు. మరి.. దీనికి ఏమని రిప్లై ఇస్తారో చూడాలి.