ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరవారిపల్లి పాఠశాలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ ఎకరం స్థలం కొనుగోలు చేసిచ్చారు. ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లగా.. అక్కడి పాఠశాలకు క్రీడా మైదానం లేదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ద్వారా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.
ఆ సమయంలో దసరా నాటికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తానని మన ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. తాజాగా తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీ పేరిట ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి.. గ్రామ పెద్దలకు బుధవారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారికంగా ఆ పత్రాలను అందజేశారు.
బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. కానీ నేడు పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే.. అగ్గిపెట్టె ల్లాంటి గదుల్లో పిల్లల్ని పెట్టేస్తున్నాము. ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా ఉండట్లేదు. ఈ పరిస్థితులు మారాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలను గుర్తించి.. ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.