తరచూ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి వెళ్లిన పవన్ కల్యాణ్ కు అక్కడి వైద్యులు పలు స్కానింగులతో పాటు.. ఇతర పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఆయనకు పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ పీఆర్ టీం వెల్లడించిన వివరాల ప్రకారం.. వైద్య పరీక్షల అనంతరం మరిన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు. త్వరలోనే మరోసారి అపోలో ఆసుపత్రికి పవన్ వెళ్లనున్నారు. ఈ నెలాఖరున కానీ.. వచ్చే నెల మొదట్లో కానీ వైద్యులు సూచన చేసిన పరీక్షలు చేయించుకుంటారని చెబుతున్నారు.
సోమవారం నుంచి మొదలయ్యే ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. వెన్ను సంబంధిత సమస్యలతో పవన్ కల్యాణ్ ఇబ్బందికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహా కుంభమేళా సందర్భంగా పుణ్య స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ వెళ్లిన సందర్భంగా ఆయన ఫిట్ నెట్ లెవల్స్ ఏ మాత్రం లేవన్నట్లుగా.. పలువురు విమర్శలు చేయటం తెలిసిందే.
యాభై ప్లస్ కు చేరుకోవటం.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు.. శరీర సౌష్టవంపై విమర్శలు చేయటం ఏ మాత్రం సరికాదన్న వాదన పలువురి నోట వినిపిస్తోంది. తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి పవన్ కల్యాణ్ బయటపడితే.. మరింత ఎఫెక్టివ్ గా పనులు చేయగలుగుతారని చెప్పక తప్పదు.