అవును ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు డేంజర్లోకి వెళ్తోంది. రాష్ట్ర పరిస్థితి శృతిమించి ఒక కొత్త సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కోబోతున్నారు. సాధారణంగా ఇలాంటి సంక్షోభాలు వస్తే ఒక దేశం మొత్తానికి రావాలి. కాావాలి. ఒక రాష్ట్రానికి మాత్రమే ఇలాంటి సంక్షోభం పరిమితం అయ్యే పరిస్థితి వచ్చిందంటే అదింకా డేంజర్. ఆ డేంజర్ ఏంటంటే… ఏపీ అప్పు. సాధారణంగా రాష్ట్రాలు చేసే అప్పు ప్రభావం ప్రజలపై నేరుగా పడదు. ఎందుకంటే సాధారణంగా అయితే ఆదాయ మార్గాలు అధికంగా ఉంటాయి కాబట్టి అప్పు ప్రభావం చూపదు. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు.
వైసీపీ రెండేళ్ల పాలనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదు వితరణ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఒకవేళ అభివృద్ధి చేసుకుంటూ పోయి, ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పోయి ఈ పని చేసి ఉంటే ఏపీకి డేంజర్ ఉండేది కాదు. కేవలం ఓటు రాజకీయంపై మాత్రమే ఆలోచించి ముందుకు వెళ్లారు. వచ్చే ఎన్నికల నాటికి అభివృద్ధి అనేది ఒక పాయింటే అవదు అనుకున్నారు. కరోనా రాకపోయి ఉంటే అలా గడిచిపోయేది. కానీ కరోనా రాకతో ప్రభుత్వం పరిస్థితి ఎలా అయ్యిందంటే… కుటుంబ యజమాని ఉద్యోగం పోతే ఆ ఇంటికి ఎలాంటి పరిస్థితి ఉందో అలా ఉంది ఏపీ పరిస్థితి.
ఈ విషయాన్ని మాజీ ఆర్థిక మంత్రి అయిన యనమల రామకృష్ణుడు విపులంగా వివరిస్తూ జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు. రెండేళ్ల పాలనపై జగన్ పుస్తకం విడుదల చేసి గొప్పలు చెప్పుకున్నారు. కానీ అందులో అనేక నిజాలు రాయకుండా వదిలేశారు. అసత్యాలతో నిండిన పుస్తకాన్ని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి విడుదల చేయటం అభ్యంతరకరం అన్నారు.
యనమల చెప్పిన పాయింట్లు:
గత 2 సంవత్సరాల్లో జగన్ చేసిన అప్పు 4 లక్షల 45 వేల కోట్లు (2014-2019 మధ్య ఐదేళ్లలో బాబు చేసిన అప్పు 1 లక్ష 40 వేల కోట్లు)
2024 వచ్చే సరికి రాష్ట్రం అప్పు 6 లక్షల కోట్లు దాటుతుంది. దాని ప్రభావం ప్రజలకు నేరుగా పడుతుంది. అన్నీ కలిపి అపుడు ఏపీకి 8 లక్షల కోట్ల అప్పులుంటాయి.
అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 60 వేల కోట్లు వడ్డీ కట్టాలి. మరో లక్షన్నర కోట్లు అసలు కట్టాలి.
అంటే 2024 బడ్జెట్ నాటికి 2.1 లక్షల కోట్లు కేవలం అప్పుకే పోతుంది. ఇక రాష్ట్రం ఖర్చులకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు?
జగన్ అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించి ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగేది.
ప్రత్యేక హోదా, విభజన హామీలను గురించి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ అడగట్లేదు.