రాజకీయ వ్యూహాలు ఎలాగైనా ఉంటాయి. అందితే జుట్టు.. అందకపోతే.. కాళ్లు.. అన్న చందంగా నాయకులు వ్యవహరించే తీరు విస్మయం కలిగిస్తూ ఉంటుంది. ఏపీలోనూ ఇలాంటి రాజకీయమే కనిపిస్తోంది. తమ త ప్పులు, తమ నిర్లక్ష్యాలను కప్పిపుచ్చుకునేందుకు, లేదా వాటి నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిపై హిందూ ధార్మిక సంఘా ల నుంచి రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువుల వరకు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ ఆలయాలపై దాడులు… మరీ ముఖ్యంగా హిందూ ధర్మానికి నిలువెత్తు రూపమైన.. రామతీర్థం లో రాముడికి జరిగిన అవమానం నిస్సందేహంగా ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ అమ్మవారి ఉత్సవ రథంలో వెండి సింహాలు మాయం.. వంటి మెజారిటీ ఘటనలను ప్రజ లు నిజంగానే జీర్ణించుకోలేక పోతున్నారనేది వాస్తవం. అయితే.. ఆయా పరిణామాలపై సరైన దిశగా స్పందించాల్సిన ప్రభుత్వం అవకాశ వాదంగా విషయాలను మళ్లిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు. కానీ.. ప్రజల మనోభావాలు.. ఒక వర్గం వారికి చెందిన అంశాలపై రాజకీ యాలు చేయడం మేధావులను సైతం విస్తు గొలుపుతున్నాయి. ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించడంతోపాటు.. ఆయా దాడుల వెనుక దుష్టశక్తులను వెలికి తీయాలని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పులేదు. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ మాత్రం .. ఈ దాడులను రాజకీయాలకు ముడి పెట్టేందుకు చేసిన ప్రయత్నం మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలపాలవుతోంది.
జగన్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టింది. అయితే.. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే ఏకై క లక్ష్యంతో ప్రధాన ప్రతిపక్షం ఇలా ఆలయాలపై దాడులు చేయిస్తోందనే వితండ వాదాన్ని సీఎం తీసు కురావడంలోనే చిత్రమైన రాజకీయం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇదే వాదన నిజమైతే.. ఇప్పటి వరకు జగన్ అనేక పథకాలు తీసుకువచ్చారు. మరి అప్పుడు ఎందుకు జరగలేదు? అనేది కీలక ప్రశ్న. ఒక శ్రీకాళహస్తి ఘటనో.. లేదా అంతర్వేది ఘటనో వెలుగు చూసినప్పుడు.. యుద్ధప్రాతిపదికన స్పందించి , చర్యలు తీసుకుని ఉంటే.. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదనే విషయం తెలిసిందే.
అయినా కూడా… ప్రభుత్వం ఎదురు దాడికి దిగడం, మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టేలా.. మా పథకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షం చేస్తున్న కుట్ర అని ప్రచారం చేయడం నిస్సందేహంగా సర్కారుపై విమర్శలకు తావిచ్చే పరిణామమే. పోనీ.. సర్కారు వాదనే నిజం అనుకుంటే.. జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమం.. అంత బలహీనమైనవనే భావించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కేవలం ఈ ఘటనలకే సదరు కోట్ల విలువైన పథకాలు వృథా అవుతున్నాయని ప్రభుత్వం భావిస్తే.. అంతకన్నా సిల్లీ థింగ్ ఉండదని, కేవలం సదరు దాడుల వెనుక దాగి ఉన్న నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సర్కారు చేస్తున్న వింత విన్యాసంగానే పేర్కొంటున్నారు.