ప్రతిపక్షంలో ఉన్న కూడా పార్టీ బలోపేతంలో ఎంతగానో కృషి చేసిన తెలుగు తమ్ముళ్ల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన వారికంటే.. ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అండంగా ఉంటామన్నారు. వారికే నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే రెండు విడతలుగా కూటమి సర్కార్ నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది.
అయితే మంగళవారం ఉదయం ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు మరియు ఇతర టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో మూడో విడత నామినేటెడ్ పదవుల నియామకంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జూన్ లోగా రాష్ట్రంలోని 214 మార్కెట్ కమిటీలు, 1,100 దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలతో పాటు అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉంటూ, టీడీపీ కోసం కష్టపడుతున్న వారికే పదవులు దక్కేలా చూడాలని.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే అని చంద్రబాబు సూచించారు.
ఆయా పోస్టులకు అర్హులైన వారి పేర్ల జాబితాను పంపించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మేము ఎమ్మెల్యే అయిపోయాం.. ఎంపీ అయిపోయాం.. ఇక కార్యకర్తలతో పనేంటని అనుకోవద్దు. ఐదేళ్లపాటు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారు.. వారి కష్టమే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయానికి కారణమని చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటి కార్యకర్తలను మరవొద్దని.. వారినెప్పుడూ గౌరవించాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేయాలన్నారు.
ఇక నామినేటెడ్ పదవులు ఆశించేవారు కచ్చితంగా పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్లలో సభ్యులై ఉండాలని.. అప్పుడు పదువులు దక్కుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. పదువుల పొందిన పనితీరును రెండేళ్లు గమనించి.. దాని ఆధారంగా భవిష్యత్తు అవకాశాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.