ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సీఎం జగన్ కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అనుహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడం, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఓటింగ్ కు ముందు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడారని, ఆ సందర్భంగా పలువురు తమకు మంత్రి పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రివర్గ కూర్పుపై జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో కేబినెట్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాబోతున్నారని, ఒకటి రెండు రోజుల్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుందని పుకార్లు వస్తున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలతో పాటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు, ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కేంద్ర పెద్దలతో కీలక అంశాలు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలోని పెద్దల ఆశీస్సులు లభిస్తే తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పుకార్లు వస్తున్నాయిజ ఏదేమైనా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం జరగడం, ఆ వెంటనే ఆ ప్రచారాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించడం, మంత్రివర్గంలోకి ప్రసన్నకుమార్ రెడ్డిని తీసుకునే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.