వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంలో సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్ కు ఇటీవల షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రఘురామ ఫోన్ తీసుకున్న సునీల్ కుమార్…వేరే వ్యక్తులకు మెసేజ్ లు పంపించారని, కస్టడీలో తనను కొట్టారని గతంలో ఫిర్యాదు చేశారు. హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నసునీల్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డీఓపీటీ శాఖకు గతంలోనే లేఖ రాశారు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్‌పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఇటీవల ఏపీ సీఎస్ కు డీఓపీటీ నుంచి లేఖ అందింది.
ఆ షాక్ నుంచి సునీల్ కుమార్ తేరుకోకముందే తాజాగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అక్రమ అరెస్టుల నేపథ్యంలో సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ సిఎస్ కు కేంద్ర హోంశాఖ తాజాగా రాసిన లేఖ పెను దుమారం రేపుతోంది. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గతంలో ఫిర్యాదు చేశారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలువురిపై సునీల్ కుమార్ కస్టోడియల్ టార్చర్ కు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధించేందుకు సునీల్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే సునీల్ కుమార్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గత అక్టోబర్ లో లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయగా తాజాగా ఆ ఫిర్యాదుపై కేంద్ర హోం శాఖ స్పందించింది. సునీల్ కుమార్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.