సార్వత్రిక ఎన్నికలు ముగిశాక విపక్ష వైసీపీ కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అధికారం లేని చోట ఇమడలేకపోతున్న వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీ మార్చేస్తున్నారు. జగన్ హయాంలో మంత్రులుగా పని చేసిన వారు సైతం పక్క చూపులు చూస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫ్యాన్ పార్టీని వీడి జనసేనలోకి జంప్ అయ్యారు. అయితే త్వరలో మరో మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ మాజీ మంత్రి మరెవరో కాదు మేకతోటి సుచరిత.
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో భారీ ప్రజాదరణ కలిగిన సీనియర్ రాజకీయ నాయకురాలు మేకతోటి సుచరిత.. 2003లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్ స్థాపించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిన సుచరిత.. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
2019లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుచరిత.. జగన్ క్యాబినెట్ లో హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణా శాఖల మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుండి మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని సుచరిత కోరినప్పటికీ.. వైసీపీ అధిష్టానం మాత్రం ఆమెకు తాడికొండ సీటును కేటాయించింది. ఫలితంగా ఆమె ఓటమి పాలయ్యారు. తనకు మంచి పట్టున్న ప్రత్తిపాడు సీటు కేటాయించుంటే తప్పక విజయాన్ని సాధించే అవకాశం ఉండేది. నియోజకవర్గ మార్పే తన ఓటమికి కారణమని సుచరిత పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పైగా గత ఎన్నికల్లో సుచరిత భర్త దయా సాగర్ కు బాపట్ల ఎంపీ సీటు ఇస్తారని ఆశించినా.. చివరకు టికెట్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వైసీపీలో సైలెంట్ అయిపోయిన సుచరిత.. ప్రస్తుతం పార్టీని వీడాలని భావిస్తున్నారట. త్వరలోనే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ లేదా జనసేనలో ఆమె చేరనున్నారంటూ రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.