విచిత్రమైన ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఎక్కడైనా ఏదైనా అక్రమం చోటు చేసుకుందని.. అధికారపక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు చేసేటప్పుడు.. సదరు నేత తన పేరును బాగా హైలెట్ అయ్యేలా చేసుకుంటారు. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీకి చెందిన ఎంపీ ఒకరు ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. అందులో ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏకరువు పెట్టారు.
ఇంత చేసిన ఆ ఎంపీ ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎంపీ పేరు బయటకు రాలేదు కానీ.. ఆయన రాసిన లేఖ మాత్రం బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది. పేదలకు ఇంటి స్థలాల పేరుతో సాగిన భూదందా భారీగా ఉందన్న వైనాన్ని ఆయన ఆరోపించారు.
సదరు ఎంపీ రాసిన లేఖకు పీఎంవో స్పందించినట్లుగా చెబుతున్నారు. ఈ ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
దీంతో.. ఇప్పుడీ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ప్రధానికి రాసిన లేఖలో ఏమేం అంశాలు ఉన్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందులోని ఆరోపణలు చూస్తే..
– ముంపుప్రాంతంలో 600ఎకరాల ఆవ భూములు రెట్టింపు ధరకు కొనుగోలు చేశారు. ఇందులో కనీసం రూ.110కోట్లు చేతులు మారాయి. ఈ వ్యవహారంలో సీఎం చిన్నాన్న కమ్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలకమైన వ్యక్తి. ఇసుక మాఫియాలోనూ ఆయనే కీలకం.
– ఇసుక కొరతను సృష్టించి ధరను రూ.10వేల నుంచి రూ. 40వేలకు పెంచేశారు. ఓ మోటర్ బైక్‌కు జీపీఆర్ఎస్ ట్యాగ్ తగిలించి ఇసుక పంపిణీ కేంద్రం నుంచి వినియోగదారుని ఇంటికి తీసుకెళ్లి అంతా సవ్యంగా జరుగుతోందనేలా చూపించి, అధిక ధరకు అమ్ముతున్నారు.
– తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్లు కట్టుకోవడానికి ఎంతమాత్రం పనికిరాని ఆవ భూములకు భారీ ధర చెల్లించారు.
– నెల్లూరు జిల్లా కావలిలో భూదందాకు సహకరించలేదంటూ కలెక్టర్‌నే ‘సంతకం పెడతావా, వెళ్లిపోతావా’ అని హెచ్చరించారు.
– పథకం ప్రకారం ముందుగానే తక్కువ ధరకు భూములు కొని, వాటినే అధికారుల చేత ఎక్కువకు కొనిపించారు.
– ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల ‘కమీషన్ల’ దందా నడిపించారు.
– ఇసుకలో నూ జగన్ పార్టీ ఎంపీలు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.