ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్లు ఒకటి. టీడీపీ హయాంలో అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. కానీ గత ప్రభుత్వంలో వైసీపీ అరాచక పాలన వల్ల అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రజలకు మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నడుం బిగించారు.
ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15న రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదటి దశలో 183 క్యాంటీన్లను రీ ఓపెన్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ల భవనాలకు దాదాపు రూ. 20 కోట్లతో మరమ్మత్తులు చేస్తున్నారు. మరో రూ. 7 కోట్లతో క్యాంటీన్లలో ఐవోటీ డివైజ్లు మరియు సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వ అధికారులు టెండర్లను పిలిచారు. ఈ నెల 22 టెండర్లకు ఆఖరి తేదీ కాగా.. జూలై నెలాఖరులోగా ఆహారం సరఫరా చేసే సంస్థలకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం ఖరారు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 20 క్యాంటీన్ల కోసం కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.65 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తానికి స్పెషల్ తేదీన అన్న క్యాంటీన్లు రీఓపెన్ కానున్న నేపథ్యంలో ప్రజలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.