అధికారంలో ఉన్నాం కదా ఇష్టం వచ్చిన చేస్తానంటే కొన్ని సార్లు కుదురుతుందేమో గానీ,అన్నిసార్లు కుదరకపోవచ్చు. రాజకీయ నాయకులతో మనకెందుకులే అని కొందరు ఊరుకుంటే…మరికొందరు మాత్రం కోర్టులకెళ్లయినా సరే తమ హక్కును సాధించుకుంటారు. ఇటువంటి ఘటనలోనే మంత్రి కాకాణికి తాజాగా షాక్ తగిలింది. అమాత్యుడిపై ఓ సాధారణ అంగన్ వాడీ టీచర్ పోరాటం చేసి మరీ గెలిచిన వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లి పరిధిలోని నల్లపాలెంలో ఉడతా సుజాత అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులకు ఆమెతో విభేదాలున్నాయి. దీంతో, ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆ నేతలు అర్జీలు పెట్టారు. అయినా సరే ఫలితం లేకపోవడంతో వారు మంత్రి కాకాణిని కలిసి సుజాతపై లేనిపోని ఆరోపణలు చేశారు.
అధికార పార్టీకి సుజాత వ్యతిరేకమని అవీ ఇవీ చెప్పడంతో మంత్రికి ఆమెపై వ్యతిరేక అభిప్రాయం ఏర్పడింది. దీంతో, ఆమెను తొలగించాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు కాకాణి. సుజాతపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు కాకాణి లేఖ రాశారు. దీంతో, జిల్లా అధికారులు కూడా చేసేదేమీ లేక సుజాతపై విచారణ చేపట్టారు. సుజాతపై వచ్చిన ఫిర్యాదులు ఉద్దేశపూర్వకంగా చేసినవేనని అధికారుల విచారణలో తేలింది.
కానీ, మంత్రి ఆదేశాలు ధిక్కరించలేక సుజాతను విధుల నుంచి తొలగించారు అధికారులు. మామూలుగా అయితే, సుజాత తరహా బాధితులు స్థానికంగా తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల దగ్గరికో, మంత్రి కాకాణి దగ్గరకో వెళ్లి రాజీ కుదుర్చుకుంటారు. కానీ, రాజీ పడని సుజాత న్యాయపోరాటానికి దిగారు. తనను అకారణంగా విధులనుంచి తొలగించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు…తాజాగా సుజాతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఫిర్యాదులుంటే మరోసారి విచారణ జరిపి తమకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. మంత్రిపై పోరాడి గెలిచిన సుజాత ఉదంతం వైసీపీ నేతల చేతిలో ఇబ్బందిపడుతున్న ఎందరో అధికారులకు కొండంత ధైర్యాన్నిచ్చింది.