నేడు రాష్ట్రంలో ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారం అయిపోతుందని భయమేస్తోందన్నారు. ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ పోతారని నిలదీశారు.
విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని..ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. టీడీపీ గెలుపు తన కోసమో, పార్టీ కోసమో కాదని.. రాష్ట్రాభివృద్ధి కోసం అని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కర్నూల్లో హైకోర్టు కావాలని గతంలో జగన్ ఎందుకు అడగలేదని నిలదీశారు. విశాఖలో పరిపాలనా రాజధాని కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అప్పుడు అమరావతే రాజధానిగా ఉండాలని ఎందుకు ఒప్పుకున్నారని విమర్శించారు.
తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగితే పోలీసులు ఎక్కడున్నారని నిలదీశారు. తన మీద రాళ్లేస్తే భయపడి పర్యటనలు ఆపేస్తామని ప్రభుత్వ ఉద్దేశమన్న బాబు.. రాళ్లు వేసినంత మాత్రాన భయపడే పార్టీ కాదని తెలిపారు.
అధికార పార్టీకి చెందిన ఓ ఫ్లెక్సీ తగులబడితే పోలీసులను రంగంలోకి దింపారని చంద్రబాబు అన్నారు. తనపై పూలేస్తే ఆ పూలల్లో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారని, ఇవాళ పూలల్లో రాళ్లున్నాయన్నారు.. రేపు అవే పూలల్లో బాంబు ఉందని అంటారా? అని పోలీసులను నిలదీశారు. అచ్చెన్నాయుడిని వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపిందన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడటం లేదు. ఇవాళే కాదు.. రేపు అనేది కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలి. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు.