న్యాయవ్యవస్ధను భయపెట్టి అనుచిత ప్రయోజనాలను పొందాలని ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్, ఏపి శాఖ డిమాండ్ చేసింది. ఏపిశాఖ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి రాసిన లేఖలో గట్టిగా డిమాండ్ చేశారు. 31 కేసులను ఎదుర్కొంటు బెయిల్ పై బయటతిరుగుతున్న జగన్ అదే న్యాయవ్యవస్ధపై ఆరోపణలు చేయటం ఏమిటంటూ మండిపోయారు.
లేఖరూపంలో జగన్ చేసిన ఫిర్యాదును చూసిన తర్వాత న్యాయవ్యవస్ధపై యుద్ధం ప్రకటించినట్లే ఉందని చలసాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరిని అనుమతించకూడదంటే కచ్చితంగా జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ స్పష్టగా చెప్పారు. అనాలోచితంగా, రాజ్యాంగ వ్యవహరిస్తున్న కారణంగానే ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను హైకోర్టు అడ్డుకుంటోందని చలసాని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకున్నంత మాత్రాన న్యాయమూర్తులపై జగన్ ఎలా ఫిర్యాదు చేశారంటూ ఈయన ప్రశ్నించారు.
ప్రభుత్వం దగ్గర న్యాయం జరగటం లేదని అనుకున్న వాళ్ళే కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్న విషయాన్ని చలసాని తన లేఖలో గుర్తు చేశారు. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు న్యాయమూర్తులపై జగన్ చేసిన ఫిర్యాదులు చాలా అభ్యంతరకరంగా ఉందని చలసాని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్ధపై ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు ఓ పద్దతి ప్రకారం దాడులు చేస్తున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.