- ఆర్థిక క్రమశిక్షణ లోపం వల్లే ఇదంతా
- జగన్ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు
ఓటుబ్యాంకు పెంచుకోవడానికి జగన్ సర్కారు ఎడాపెడా అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అది అంచనాలకు మించిపోయింది. ఆర్థికంగా క్రమశిక్షణ లేని కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందని కేంద్రప్రభుత్వంతో పాటు ఆర్థిక నిపుణులు సైతం విమర్శిస్తున్నారు.
అమ్మఒడి, వైఎస్సార్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత సరఫరా మొదలైన అనేక పథకాలను ప్రవేశపెట్టడంవల్ల రెవెన్యూ లోటు అనూహ్యంగా పెరిగిపోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాలను వాస్తవికంగా అంచనా వేయడంలో విఫలమైంది.
రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంటు అందినప్పటికీ, రెవెన్యూ లోటులో పెరుగుదల కొనసాగుతోంది. 2020-21లో ఈ లోటు అంచనా రూ.5,897 కోట్లు ఉండగా.. వాస్తవిక రెవెన్యూ లోటు రూ.34,926.80 కోట్లకు పెరిగింది. కేంద్రం ఇదే సంవత్సరంలో పన్నుల రూపంలో రాష్ట్రానికి రూ.29,935.32 కోట్లు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద రూ.57,930.62 కోట్లు, రుణాల కింద రూ.2 వేల కోట్లు విడుదల చేసింది.
15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం ఇదే సంవత్సరంలో వివిధ పద్దుల కింద సొంత పన్నుల రాబడి కింద రూ.77,398 కోట్లు రెవెన్యూ వస్తుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. కానీ రూ.57,377.97 కోట్లు మాత్రమే వచ్చాయి.
పన్నేతర (నాన్-టాక్స్) రెవెన్యూ కింద రూ.5,267 కోట్ల వరకు రావచ్చని భావించింది. వాస్తవికంగా రూ.3,309.61కోట్ల రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ వ్యయం పద్దు కింద రూ.1,23,718 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. రూ.1,52,989.89 కోట్లు ఖర్చయింది.
ఇందులో వడ్డీ చెల్లింపుల కింద రూ.22,026.30 కోట్లు, పింఛన్ల కింద రూ.14,507.52 కోట్లు పోయాయి. ఆర్థిక నిర్వహణలో ఇన్ని తప్పుటడుగులు వేస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భరించలేనంత ఆందోళనకరంగా ఉందని.. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు సహకరించాలని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో వేడుకోవడం గమనార్హం.
ఇచ్చిన నిధులూ వాడలేదు..
ఓపక్క కేంద్ర సాయం కోరుతున్న జగన్ ప్రభుత్వం.. కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన నిధులను వినియోగించుకోవడమే లేదు. గత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ లైవ్‌స్టాక్ మిషన కింద విడుదల చేసిన రూ.1073.13 కోట్లు, జాతీయ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎనడీసీపీ) కింద విడుదల చేసిన రూ.4,027.85 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా వాడలేదు.
ఎన్డీసీపీ కింద 2019-20లో ఇచ్చిన రూ.3,110.99 కోట్లలోనూ కేవలం రూ.1,482.87 కోట్లే ఖర్చుచేసింది. అన్నిటికీ మించి.. కీలకమైన ఉపాధి హామీ పథకం కింద 2019-20లో రూ.7,311.48 కోట్లు విడుదల చేయగా రూ.1,022.1 కోట్లు ఇంకా వ్యయం చేయలేదు. 2020-21లో విడుదల చేసిన రూ.10,365.48 కోట్లల్లో రూ.1,991.07 కోట్లు వ్యయం కాలేదు.