కర్నాటక ఎన్నికల నేపధ్యంలో కొందరు ఆంధ్రా ఓటర్లు డబుల ధమాకా అందుకోబోతున్నారు. కర్నాటక జిల్లాలకు ఆంధ్రాలోని అనంతపురం, కర్నూలు జిల్లాలు సరిహద్దులుగా ఉన్న విషయం తెలిసిందే. సరిహద్దు గ్రామాలంటే ఎలాగుంటాయంటే భౌగోళికంగా కొన్ని గ్రామాలు అటు కర్నాటకలోను ఇటు ఆంధ్రాలోను విస్తరించుంటాయి. అంటే కొన్ని వీధులు ఏపీలో ఉంటే మరికొన్ని వీధులు కర్నాటకలో ఉంటాయి. బయటవాళ్ళకు ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది కానీ అక్కడి వాళ్ళకు ఇదంతా మామూలే.
ఇపుడు విషయం ఏమిటంటే కర్నాటక అసెంబ్లీల ఎన్నికల్లో ఏపీ జనాలు కూడా ఓట్లేయబోతున్నారట. ఏపీ జనాలు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఓట్లేస్తారంటే డబుల్ ఓటింగ్ సౌకర్యం కారణంగానే. అంటే కొందరికి రెండురాష్ట్రాల్లోను ఓటు హక్కు ఉండటమే ప్రధాన కారణం. నిజానికి రెండు ప్రాంతాల్లో ఓట్లుండటం కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చెల్లకపోగా తీవ్రమైన శిక్షార్హం కూడా. అయితే ఇలాంటి పరిస్ధితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉంది.
అందుకనే జనాలను శిక్షించేబదులు ఓట్లను ఏరేయటమే ఉత్తమమని కమీషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తమ ఓటుకు ఆధార్ కార్డును లింక్ చేసే ప్రక్రియను తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. కాబట్టి చాలామందికి ఇంకా రెండు ప్రాంతాల్లోను ఓట్లుంటున్నాయి. ఏపీ-తెలంగాణాలో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణా నుండి ఏపీకి ఓట్లేసేందుకు కొన్ని లక్షలమంది వెళుతుండటం మనకందరికీ తెలిసిందే. అంటే అలాంటివాళ్ళు రెండుచోట్లా ఓటుహక్కును ఉపయోగించుకుంటున్నట్లే కదా.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని మడకశిర, హిందుపురం, ఆదోని, ఆలూరు, రాయదుర్గం, కల్యాణదుర్గం, మంత్రాలయం నియోజకవర్గాల్లోన్ని కొన్ని గ్రామాల ఓటర్లకు కర్నాటకలోని పావగఢ, మధుగిరి, సిరా, హిరియాళ్, అమరాపుర, గౌరిబిదనూర్, భాగేపల్లి, విజయనగర మండలాల్లో కూడా ఓట్లున్నాయట. ఈ మండలాలు కర్నాటకకు సంబంధించి మూడు జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఓ అంచనా ప్రకారం సగటున ప్రతి నియోజకవర్గంలో 15 వేలమంది ఏపీ ఓటర్లు మే 10వ తేదీన కర్నాటక ఎన్నికల్లో ఓట్లేయబోతున్నారు. ఏపీలోని పై నియోజకవర్గాల ప్రజలు కర్నాటకలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా ఓట్లేస్తున్నారు. అంటే కర్నాటక ఎన్నికలపై ఏపీ ఓటర్ల ప్రభావం ఏ స్ధాయిలో ఉంటుందో అర్ధమవుతోంది.