సెప్టెంబర్ 17 వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత విషయంలో తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని బీజేపీ నేతలు పిలుపునిస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినం కాదని….దానిని తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ నేతలు పిలుపునిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై కూడా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అమిత్ షాకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను విభజించేందుకు, ఎగతాళి చేసేందుకే అమిత్ షా తెలంగాణకు వచ్చారని కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. 74 ఏళ్ల క్రితం కేంద్ర హోం మంత్రి ఒకరు తెలంగాణ ప్రజలను భారత్ లో విలీనం చేశారని గుర్తు చేసుకున్నారు.
తద్వారా సమైక్యతను ఆయన చాటారని కేటీఆర్ కొనియాడారు. కానీ, ఈరోజు మరో కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను విభజించి రాష్ట్ర ప్రభుత్వంపై బెదిరింపులకు పాల్పడేందుకు వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదని, నిర్ణయాత్మక రాజకీయాలని కేటీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
మరోవైపు, అమిత్ షాపై ఎమ్మెల్సీ కవిత కూడా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జాతీయ సమైక్యత దినోత్సవం హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని కవిత మండిపడ్డారు. రాష్ట్రాలకు హామీలు ఇవ్వడం, ప్రజల వారిని తిరస్కరించగానే వంచించడం బీజేపీకి అలవాటు అని ఎద్దేవా చేశారు. బీజేపీ తమకు అలవాటైన ఎన్నికల ఉత్సవాలు అన్న సూత్రాన్ని తెలంగాణలో కూడా అమలు చేసేందుకు వచ్చిందని చురకలంటించారు.