కరోనా గిరోనా లేదు…కుంభమేళా వచ్చేయ్ బ్రదర్…హరిద్వార్ నగరంలో వీధి వీధి నాదే బ్రదర్…గంగలో మునకేసి కాషాయం కట్టేయ్ బ్రదర్….చదవడానికి కొంచెం వెటకారంగా ఉన్నా…ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. కరోనా నిబంధనలు పాటించాలని చెబుతోన్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి సైతం కరోనా నిబంధనలు గాలికి వదిలేసి గుంపులో గోవిందలాగా 20 మంది సాధువులతో కలిసి గంగలో మునకేశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో, అమిత్ షా, యోగిలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు ఆంక్షలు పెడుతుంటే…బాధ్యతగా ఉండాల్సిన షా మాత్రం నిర్లక్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎదుటి మనిషికి చెప్పేందుకే రూల్స్ ఉన్నాయని…పాటించేందుకు కాదని షా నిరూపించారని ట్రోలింగ్ జరుగుతోంది. ఇక, కుంభమేళాలో పాల్గొన్న యోగి కరోనా బారిన పడిన సంగతిపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది…కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నెటిజన్లు ట్రోల్ చేయడానికి అవకాశమిచ్చిన షా, యోగిల ఫొటో…ఈ ఏడాది కుంభమేళాలోది కాదు. 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభమేళాలో షా, యోగి పాల్గొన్న ఫొటోను కొందరు ఈసారి కుంభమేళాకు జోడించి వైరల్ చేశారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుండడం…కుంభమేళా కొనసాగిస్తామంటూ ప్రకటన చేయడం నేపథ్యంలో చాలామంది నెటిజన్లు కూడా ఈ ఫొటో నిజమనుకొని నమ్మేశారు.
అందుకే,సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులలో ఏది రియల్? ఏది వైరల్ ? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. గత ఏడాది కరోనా సూపర్ స్ప్రెడర్ అంటూ ఢిల్లీలోని మర్కస్ మస్జిద్ ఎపిసోడ్ కు అనుబంధంగా వచ్చిన కొన్ని ఫొటోలు, వార్తలు కూడా ఫేక్ అని అనేక వార్తా సంస్థలు, ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికే ఓ వర్గంవారికి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. అందుకే, సోషల్ మీడియాలో ఏది రియల్ ఏది వైరల్ అని తెలుసుకొని షేర్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.