నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సుప్రీం కోర్టు జోక్యంతో నాటకీయ పరిణామాల మధ్య రఘురామను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ అరెస్టు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు.
రఘురామ అరెస్టు వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. అటువంటి పెద్దవారి సహకారం లేకుండా రఘురామను అరెస్ట్ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అయితే, రఘురామ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని, అదే సమయంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకొని సొంత పార్టీపై రఘురామ తిరుగుబాటు చేశారని, ఇపుడు అదే కేంద్రంలోని పెద్దల అండతో ఆయనను అరెస్టు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఓ వ్యాక్సిన్ కంపెనీ అధినేత కులం గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించడం సరికాదని నారాయణ అన్నారు. రఘురామ వంటి వ్యక్తుల అరెస్టులకు కేంద్రస్థాయిలో బీజేపీ పెద్దల అనుమతి ఉందని, రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం అరెస్టులను ఖండిస్తున్నబీజేపీ నేతల తీరు వింతగా ఉందన్నారు. ఈటల రాజేందర్ పైనా కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని అన్నారు.