వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ వర్సెస్ వైసీపీ నేతలు అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ కు గళ్ళ లుంగీ, ఎర్ర చొక్కా, బుగ్గన చుక్క పెట్టి రౌడీలా చూడాలని పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేశారని జగన్ పై పవన్ సంచలన విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా పవన్ పై నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు స్పందించారుజ పవన్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని, చికిత్స చేసేవారు ఎవరైనా ముందుకు రావాలని అంబటి సెటైర్లు వేశారు. పవన్ కు చికిత్స చేస్తే ఒక కేస్ స్టడీకి పనికొస్తుందని అన్నారు.
పెళ్లిళ్ల గురించి మాట్లాడగానే పవన్ కు కోపం వస్తుందని, అయితే, పవన్ ఏక పత్నీ వ్రతుడని అంబటి సెటైర్లు వేశారు. ఏక కాలంలో ఏక పత్ని మాత్రమే పవన్ కు ఉంటుందని చురకలంటించారు. గౌరవానికి, మర్యాదకు మారుపేరైన గోదావరి జిల్లాలో పవన్ చాలా మర్యాదగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. కానీ, గోదావరి జిల్లాలకు పవన్ మళ్లీ ఎప్పుడు వస్తారు అంటూ ప్రశ్నలు సంధించారు. లెక్కలు తేలకుండా మళ్ళీ గోదారి జిల్లాలకు పవన్ రారని చురకలంటించారు. తన ప్రసంగంలో 373 సార్లు జగన్ పేరును పవన్ ప్రస్తావించారని, వెయ్యి సార్లు జగన్ నామస్మరణ చేస్తే పవన్ పాపాలు కొన్ని పోతాయని సలహా ఇచ్చారు.
బందరు వెళ్లి చెప్పులు వెతుక్కుంటే మంచిదని పవన్ కు అంబటి పంచులు వేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు పవన్ వచ్చాడని చెప్పుకుంటున్నారని, దేవుడి దీపంతో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ కొడుకు హిందూ ధర్మ రక్షణకు వచ్చారని తీవ్రంగా విమర్శించారు. మరి అంబటి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.