మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు పోలీసులు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళీ కృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు నమోదైంది. భజరంగ్ దళ్ జూట్ మిల్లు స్థలాల విక్రయం, గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్స్ అక్రమ నిర్మాణాలపై పోరాటం చేస్తున్న సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు పిల్లి బాబూరావుపై అంబటి సోదరులు బెదిరింపులకు పాల్పడి దాడి చేశారని ఆరోపణలున్నాయి.
అంబటి సోదరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాబూరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలతో అంబటి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై అంబటి స్పందించారు. తాను సిద్ధంగా ఉన్నానని, లా అబైడింగ్ సిటిజన్ గా పోలీసుల విచారణకు రెడీగా ఉన్నానని అంబటి అన్నారు.
ఎస్పీ, డీఎస్పీ, ఐజీ, డీఐజీ, ఎస్సై అందరికీ చెబతున్నానని చెప్పారు. ‘‘నాకు ఫోన్ చేయండి.. విచారణకు పిలవండి..అరెస్టు చేస్తే వస్తా..లోపల పెడితే ఉంటా..’’ అంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్వాతంత్ర్య సమరయోధుడి మాదిరి అరెస్టు చేయండి…కటకటాలను ముద్దాడతా అన్న రేంజిలో అంబటి వ్యాఖ్యానించడం కామెడీగా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.