ఏపీలో గత 685 రోజులుగా అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీ యువకులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ అమరావతిపై జగన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
అమరావతిలోని తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర తిరుపతిలో ముగియనుంది. 45 రోజుల పాటు దాదాపు 450 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మహా పాదయాత్రకు ఎన్నారైలు కూడా తమ మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ మహా పాదయాత్రకు అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, తానా మాజీ అధ్యక్షుడు ‘జయరాం కోమటి’ సంఘీభావం తెలిపారు.
ఈ పాదయాత్రలో అమెరికా నుంచి ఎన్నారైలు కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. ఈ యాత్రకు పూర్తి మద్దతు,సహకారం ఉంటుందన్నారు.
అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులను ఎన్నారైల బృందం కలవనుందని, అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఎన్నారైల బృందం ఒక లేఖను అధికారులకు అందజేయనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి అమరావతి ఉద్యమాన్ని ఎన్నారైలు తీసుకువెళ్లనున్నారని వెల్లడించారు.
అమరావతి నుంచి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పలు నిరసనల కార్యక్రమాలకు గతంలోనూ ఎన్నారైలు అండగా ఉన్నారని, భవిష్యత్తులోనూ మద్దతుగా ఉంటామని తెలిపారు. గత ఏడాది జులై 4వ తేదీన అమరావతి రైతుల ఉద్యమం 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఎన్నారైలు 200 నగరాలలో ‘ఎన్నారైస్ ఫర్ అమరావతి’ అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారని, అమెరికాతో పాటు పలు దేశాల్లోని ప్రవాసాంధ్రులు పాల్గొన్న ఆ కార్యక్రమం విజయవంతమైందని గుర్తు చేశారు.
అదే తరహాలో పాదయాత్రలో కూడా భారీ సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని రైతులకు మద్దతుగా, అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారని వెల్లడించారు. పాదయాత్రలో ఎన్నారైలు పాల్గొనబోయే కార్యక్రమం కూడా విజయవంతమవుతుందని ‘జయరాం కోమటి’ ఆశాభావం వ్యక్తం చేశారు.