అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ, రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 2.0 రోజు రోజుకు మహోధృతమవుతోంది. పాదయాత్ర తొమ్మిదో రోజు బాపట్ల జిల్లా నుంచి కృష్ణా జిల్లా లోకి ప్రవేశించింది. పెనుమూడి వారధి పై నుంచి రైతుల పాదయాత్రకు కృష్ణా డెల్టా ప్రజానీకం ఆత్మీయ స్వాగతం పలికింది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని చెంత పూజలు చేసిన రైతులు అమరావతిని ఆశీర్వదించాలని మొక్కుకున్నారు. కాగా, పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
ముఖ్యంగా, దేశ విదేశాల్లోని తెలుగు వారు సైతం, అమరావతి రాజధానికి మద్దతుగా ముందుకు వస్తున్నారు. రైతులు చేస్తున్న అలుపెరుగని రాజధాని పోరులో.మేము సైతం అంటూ నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా పాదం కదుపుతున్నారు. వారితో కలిసి, సంఘీభావంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ దమన నీతిని ఈ సందర్భంగా వారు ఎండగడుతున్నారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయినా, రాజధాని లేకపోవడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు.
ఇక, పెనుమూడి – పులిగడ్డ వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో, రైతులకు జనం అపూర్వ స్వాగతం పలికారు. వారధికి రెండువైపులా అమరావతి రైతు నేతలు ఆకుపచ్చ జెండాలతో అలంకరించారు. రైతులు ఆకుపచ్చని కండువాలు, టోపీలు, జెండాలతో నడుస్తున్న సమయంలో, వారధి హరిత వర్ణ శోభతో కళకళలాడింది. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, జనం సందడితో వారధిపై కోలాహలం నెలకొంది.
మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ వారధిపై స్వాగతం పలికి రైతులను ఆహ్వానించారు. జనం రద్దీ ఎక్కువగా ఉండటం, మోపిదేవి నుంచి ప్రజలు తరలిరావడంతో, జనసందోహం నడుమ యాత్ర నెమ్మదిగా సాగింది. మోపిదేవిలో భోజన విరామం తీసుకున్న రైతులు, అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో పూజలు చేశారు. పెదప్రోలు, కప్తానుపాలెం, కాసానగరం మీదుగా చల్లపల్లి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.
ఎన్నారైల మద్దతు ఇదీ!!
రైతుల పాదయాత్రకు అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చి మరీ రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 2.0కు వారు సంఘీభావం తెలిపి, పాదయాత్రలో అడుగులు కలిపారు. వీరిలో జానకిరామ్ బోగినేని వాషింగ్టన్ డీసీ నుంచి రాగా, శ్రీనివాస్ వల్లూరుపల్లి బే ఏరియా నుంచి వచ్చి రైతులతో కలిసి ముందుకు సాగారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దారుణమని, ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. రైతులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.