అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర కోరారు. ది.26-08-2022 శుక్రవారం వాషింగ్టన్ డీసీలో అమెరికాలో ఉన్న అమరావతి రాజధాని ప్రాంత ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులతో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొని అమరావతి ప్రాంత రైతులతో చర్చించారు.
సెప్టెంబర్ 12వ తేదీ నాటికి అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తవుతోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా అమెరికాలో కూడా పాదయాత్ర నిర్వహించడం, ప్రధాన నగరాల్లో అమరావతికి మద్దతుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డులో ఉండాలి, కనీసం 30వేల ఎకరాలు కావాలి, 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయినందున ప్రాంతీయ చిచ్చుపెట్టడం ఇష్టంలేక అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తర్వాత మాటతప్పి ప్రజలను మోసం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధానిని మార్చే హక్కుగాని, మూడు రాజధానులు పెట్టే అధికారం లేదని తెలుసు. కానీ మూడేళ్లపాటు ప్రజలను మభ్యపెట్టారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు పార్లమెంట్ లో పెట్టడం ద్వారా మరింత తేటతెల్లమైంది. అయినా ఆశ చావక రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టేందుకు దురాలోచన చేస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అభూతకల్పనలను, పచ్చి అబద్ధాలను వల్లెవేశారు. న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఖాతరు చేయకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్నం పెట్టకపోగా.. పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. ఇది జగన్ రెడ్డి పైశాచికత్వానికి పరాకాష్ట. కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని అడ్డుకోవడం అప్రజాస్వామికం.
భాను మాగులూరి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం అసహ్యించుకుంటున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజలను చైతన్యపరిచే క్రమంలో సోషల్ మీడియా వేదికగా వెంగళరావు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాడు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను హరిస్తూ జగన్ రెడ్డి పోలీసుల ద్వారా అమానుషంగా కొట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మన్నవ వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ ఆచంట, చనుమోలు అనిల్ కుమార్, ధూళిపాళ్ల వీరనారాయణ, కోట రామ్మోహన్, కిషోర్ కంచర్ల, ముప్పనేని జగన్మోహన్ రావు, అజయ్ గోవాడ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం శ్రీకాంత్ ఆచంట, మన్నవ వెంకటేశ్వరరావు ధూళిపాళ్ల నరేంద్రను ఘనంగా సత్కరించారు.