ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జూన్ 14 నుంచి అన్నవరంలో వారాహి యాత్ర ప్రారంభించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 14న పత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. కత్తిపూడి బస్టాండ్ సెంటర్లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ జరగనుంది.
మరోవైపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ పై నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
“అతడు పసివాడుగా ఉన్నప్పుడు నడక నేర్పించాను… ఏది తప్పు, ఏది ఒప్పు అని మార్గదర్శనం చేశాను. ఇప్పుడు మేం పెద్దవాళ్లం అయ్యాం. సరైన పంథాలో వెళ్లడానికి అవసరమైన లోతైన అవగాహనను అతడు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేను అతడి అడుగుజాడల్లో నడుస్తున్నాను” అని నాగబాబు ట్వీట్ చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పవన్ వెంట నాగబాబు నడుస్తున్న సంగతి తెలిసిందే.