శనివారం ఉదయం హఠాత్తుగా జీవిఎంసీ అధికారులు విశాఖపట్నం మాజీ ఎంపి సబ్బంహరికి పెద్ద షాక్ ఇచ్చారు. గడచిన 20 ఏళ్ళుగా ఆయన స్వాధీనంలో ఉన్న ప్రభుత్వస్ధలాన్ని ఉన్నతాధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంలో తన ఇంటికి పక్కనే ఉన్న పార్కు స్ధలాన్ని సబ్బం ఆక్రమించేశారు. పార్కును ఆక్రమించిన విషయాన్ని స్ధానికులు ఎంతమంది ఆక్షేపించినా అప్పట్లో హరి పట్టించుకోలేదు. అయితే ఇంతకాలానికి ఈ విషయమై ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. ఈరోజు ఉదయాన్నే సబ్బం ఇంటి దగ్గరకు వచ్చి ఆక్రమించిన స్ధలాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
దాదాపు 12 అడుగుల పార్కు స్ధలాన్ని ఆక్రమించుకున్న సబ్బం అందులో టాయిలెట్లు నిర్మించారు. ఆక్రమణలపై విచారణ చేస్తున్న జీవిఎంసీ ఉన్నతాధికారులకు సబ్బం ఆక్రమించిన స్ధలంపైన కూడా తాజాగా ఫిర్యాదులు అందాయి. దాంతో విచారణ చేసిన టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు ఆక్రమణలు వాస్తవమే అని నిర్ధారించారు. దాంతో పోలీసులు, మున్సిపాలిటి అధికారులు సంయుక్తంగా సబ్బం ఇంటి దగ్గరకు చేరుకున్నారు. విషయాన్ని ఇంట్లోని వాళ్ళకు చెప్పారు. వెంటనే జేసీబీలను రంగంలోకి దింపేసి కూల్చివేతలు మొదలుపెట్టేశారు.
ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోని సబ్బంకు ఉన్నతాధికారులు ఒక్కసారిగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.