టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై చివరి సూపర్-8 మ్యాచ్‌లో అప్ఘాన్ అద్భుత విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అఫ్ఘాన్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడం ఒకెత్తయితే.. మాజీ ఛాంపియన్, ప్రపంచ మేటి జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టడం మరో ఎత్తు. క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేసిన విషయం ఇదే.
గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 149 పరుగుల లక్ష్యాన్ని నిలిపినప్పటికీ.. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆ జట్టును 127 పరుగులకే ఆలౌట్ చేసిన అఫ్ఘాన్ సంచలన విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోవడంతో.. అఫ్ఘానిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ మీద అందరి దృష్టీ నిలిచింది. ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ గెలిస్తే ఆ జట్టుదే సెమీస్ బెర్తు. ఓడితే మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా ముందంజ వేసేది.
ఐతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. చిన్న లక్ష్యం కావడంతో అఫ్ఘాన్ కథ ముగిసినట్లే అనుకున్నారు. మధ్యలో వర్షం వల్ల బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్ణయించగా.. ఒక దశలో 8 ఓవర్లకు 63/4తో నిలిచింది. 6 వికెట్లు చేతిలో ఉండగా 12 ఓవర్లలో 53 పరుగులే చేయాల్సి రావడంతో బంగ్లా విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ తర్వాతి ఓవర్ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ వెళ్లిన అఫ్ఘానిస్థాన్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే బంగ్లాను ఆలౌట్ చేసి సంచలన విజయాన్నందుకుంది.
గ్రూప్-1 నుంచి సూపర్-8లో భారత్ మూడు విజయాలతో ఇప్పటికే సెమీస్ చేరగా.. రెండు విజయాలతో రెండో స్థానం సాధించిన అఫ్ఘాన్ ముందంజ వేసింది. ఒక విజయం సాధించిన ఆస్ట్రేలియా, మూడు మ్యాచ్‌లూ ఓడిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అఫ్ఘానిస్థాన్ గెలవడం కంటే ఆస్ట్రేలియా నిష్క్రమించడం భారత అభిమానులకు అమితానందాన్నిస్తోంది. ఎందుకంటే గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో, అంతకుముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరులో.. 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా కలిగించిన వేదన అంతా ఇంతా కాదు. ఇప్పుడు భారత్ చేతిలో ఓటమితోనే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి రావడం మన అభిమానులకు ఎంతో సంతృప్తినిస్తోంది.