ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీటీడీలో అనేక వ్యవహారాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీటీడీ ఆస్తుల వేలం మొదలు రమణ దీక్షితులు నియామకం వరకు ఎన్నో నిర్ణయాలు దుమారం రేపాయి. టీటీడీ అధికారుల తీరు కూడా బాగోలేదని భక్తులు పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీపై సినీనటి నమిత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
టీటీడీ అధికారులు తీరుపై నమిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని నమిత ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని, గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో పరిపాలన బాగుందని అభిప్రాయపడ్డారు. టీటీడీ ఉద్యోగులంతా భయాందోళనలో ఉన్నారని నమిత షాకింగ్ కామెంట్లు చేశారు. తాను నటించిన భౌభౌ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని నమిత వెల్లడించారు. ‘థియేటర్’ పేరుతో ఓటీటీ యాప్, నిర్మాణ సంస్థను ప్రారంభించామని నమిత వెల్లడించారు.
అయితే, తిరుమలకు వచ్చిన సెలబ్రిటీలు ఈ తరహాలో విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. దీంతో, నమిత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ, నమిత తాజా వ్యాఖ్యలపై ఇప్పటి వరకు టీటీడీ అధికారులు ఎవరూ స్పందించలేదు. భక్తులు ఆరోపణలు చేస్తేనే అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ, సెలబ్రిటీ హోదాలో ఉన్న నమిత ఆరోపణలపై టీటీడీ అధికారులు పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిని బట్టి తిరుమలలో నమిత చెప్పినట్టు నిజంగానే పరిస్థితులు బాగోలేవని, అందుకే అధికారులు స్పందించడం లేదని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.