మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా చేసిన విమర్శలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులు సొంత జిల్లాలోనే ఓటమి పాలయ్యారని రోజా చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. సినిమాల వల్ల ఎంతో సంపాదించుకున్న వారంతా ఎవరికీ సాయం చేయలేదని, అందుకే ప్రజలు ఆదరించలేదని విమర్శించారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పరిశ్రమలో లేకుండా చేసేస్తారని, ఆ భయంతోనే చిన్న మెగా ఫ్యామిలీకి అనుకూలంగా మాట్లాడుతుంటారని అన్నారు.
ఈ నేపథ్యంలోనే రోజా వ్యాఖ్యలకు టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. తనను మెగా ఫ్యామిలీకి క్యాంపెయిన్ చెయ్యమని గానీ, పార్టీలో చేరమని గానీ ఎప్పుడూ అడగలేదని బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. మిమ్మల్ని విమర్శించింది చిన్న ఆర్టిస్టులే (హైపర్ ఆది) కదా… చిన్న ఆర్టిస్టుల విమర్శలకే ఎందుకంత భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రోజాను జనసేనాని పవన్ కల్యాణ్ డైమండ్ రాణి అని సంబోధించడం కూడా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
బ్రహ్మాజీ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘మీ నుంచి ఈ రియాక్షన్ ఊహించలేదన్నా.. సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన మొదటి వ్యక్తివి నువ్వు.. థ్యాంక్యూ’ అంటూ మెగాభిమానులు, జనసేన అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్‌ను రీ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల సభలో వైసీపీ నేతలపై హైపర్ ఆది కూడా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.