కుండపోతగా కురుస్తున్న వర్షాలు, వరదలు కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ఏపీలో విజయవాడ మొత్తం జలమయం అయింది. వేలాది ఇళ్లు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. భారీ ప్రాణనష్టం జరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూటమి సర్కార్ ప్రజలను అండంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులను, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు.
విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్లమంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? ఇంత చేతగాని తనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారూ అంటూ జగన్ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు.
అయితే జగన్ ట్వీట్ కు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. `మీరు కరెక్టు సార్.. వాళ్లు చేయ్యలేరు.. ఇక నుండి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైసీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా` అంటూ బ్రహ్మాజీ ఎక్స్ ఖాతా ద్వారా సెటైరికల్ గా పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో.. వైసీపీ నాయకలు, కార్యకర్తలు బ్రహ్మాజీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో బ్రహ్మాజీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. `నా ఎక్స్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి ట్వీట్ చేశారు. నాకు ఆ ట్వీట్ కి సంబంధం లేదు. కంప్లైంట్ చేసాం` అని మరో ట్వీట్ చేశారు.