తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఎక్కువ మునిసిపాలిటీలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కుప్పం మున్సిపల్ పోరు ఉత్కంఠ రేపగా…అక్కడ వైసీపీ విజయం సాధించడంపై టీడీపీ నేతలు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు…కౌంటింగ్ ముగిసే వరకు కుప్పంలో వైసీపీ చేసిన అరాచకాలు అందరికీ తెలుసని అచ్చెన్నాయుడు అన్నారు.
చేతకాని ఎన్నికల సంఘమే టీడీపీ ఓటమికి కారణమని అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. వైసీపీకి పోలీసు వ్యవస్థ ప్రత్యక్షంగా మద్దతునిచ్చిందని, ఈ ఎన్నికల్లో నైతిక విజయం టీడీపీదేనని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి దొంగ ఓట్ల మంత్రి అని, పక్క నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని ఆరోపించారు. వైసీపీకి ప్రజాదరణ లేదని, ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైసీపీ ఘోర ఓటమి పాలయ్యేదని అన్నారు.
మరోవైపు, ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఓట్ల కౌంటింగ్ లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.1వ వార్డులో ముందుగా టీడీపీ గెలిచిందని, ఆ తర్వాత వైసీపీ గెలిచిందని అధికారులు ప్రకటించారని మండిపడ్డారు.1వ వార్డు కౌంటింగ్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ… కౌంటింగ్ కేంద్రం ముందు దేవినేని ఉమ నిరసన వ్యక్తం చేశారు.
కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు బాక్సులు మార్చారని అభ్యర్థి ఆరోపిస్తున్నారని, అక్కడ రీకౌంటింగ్ పెట్టాలని దేవినేని ఉమ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ విజయాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. ఫలితాలను తారుమారు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమంటే ఓటమిని ఒప్పుకున్నట్టే కదా ముఖ్యమంత్రి గారూ? అని జగన్ ను నిలదీశారు.