ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరును వివేకా కూతురు సునీత ప్రస్తావించడం, తనకు ఏపీ సర్కార్ న్యాయం చేస్తే ఢిల్లీదాకా ఎందుకు వస్తానని ప్రశ్నించడం కలకలం రేపాయి. దీంతో, సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలంటూ విపక్ష నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు.
ఈ క్రమంలోనే వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదని తిరుపతిలో శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయాలంటూ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సవాల్ చేసినట్టుగానే ఏప్రిల్ 14న లోకేష్ అలిపిరికి చేరుకొని జగన్ కోసం ఎదురుచూశారు. కానీ, జగన్ అక్కడికి రాకపోవడంతో లోకేష్ ఒక్కరే ప్రమాణం చేసి వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని తిరుపతిలో లోకేశ్ ప్రమాణం చేశారని, ప్రమాణం చేయకుండా తాడేపల్లి కొంపలో జగన్ పిల్లిలా నక్కి దాక్కున్నారంటూ అచ్చెన్న షాకింగ్ కామెంట్లు చేశారు. తండ్రి శవం పక్కనే సీఎం పదవికోసం జగన్ సంతకాలు సేకరించాడని ఎద్దేవా చేశారు.
బాబాయ్ బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి వుంటే, ఓట్లు దండుకోవడానికి చూశాడని దుయ్యబట్టారు. లోకేశ్ సవాల్ విసిరితే పారిపోయావు, దీంతో, ఈ హత్య మీ పనేనని ఒప్పుకున్నావు… అని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి, ఈ వ్యాఖ్యలపై, లోకేశ్ సవాల్ స్వీకరించకపోవడంపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.