ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఓవైపు జగన్ సిద్ధమంటూ సభలు నిర్వహిస్తుంటే… టీడీపీ-జనసేన ఉమ్మడిగా బహిరంగ సభలు మొదలుబెట్టాయి. మరోవైపు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ఒపీనియన్ పోల్ సర్వేలు కొన్ని సంస్థలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏబీపీ సీ ఓటర్ సర్వే ప్రకారం 2024లో వైసీపీకి 142 సీట్లు వస్తాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
టీడీపీ-జనసేన కూటమికి కేవలం 33 సీట్లు మాత్రమే వస్తాయని ఆ సర్వే ఫలితాలలో వెల్లడించినట్లుగా ఆ పోస్టులో ఉంది. ఇంకేముంది ఈ పోస్టును వైసీపీ సోషల్ మీడియా విభాగం, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పై తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ స్పందించింది. ఏపీలో ఒపీనియన్ పోల్ సర్వే అని సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఫేక్ అని, సోషల్ మీడియాలో యూజర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏబీపీ నెట్వర్క్, దాని ఇతర అనుబంధ సంస్థలు అటువంటి సర్వే ఫలితాలను విడుదల చేయలేదని ప్రకటించింది. ఆ సర్వేకు తమ సంస్థతో సంబంధం లేదని క్లారిటీనిచ్చింది.
దీంతోపాటు రాబోయే ఎన్నికల్లో ప్రధాన మంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనే పోస్ట్ కూడా వైరల్ అవుతుందని, దానికి ఏబిపికి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. దీంతో, వైసీపీ అభిమానులే ఇటువంటి ఫేక్ న్యూస్ ను వైరల్ చేసి ఉంటారని వారిపై విమర్శలు వస్తున్నాయి.