నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రఘురామతోపాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లపై కూడా ఏపీ సీఐడీ రాజద్రోహం కేసులు పెట్టడంపైనా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు జగన్ తూట్లు పొడుస్తున్నారని పలువురు రాజకీయ నేతలు, మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తన బెయిల్ పిటిషన్ పై రఘురామ సుప్రీంకోర్టు తలుపు తట్టగా…తాజాగా రఘురామను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులను సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి, టీవీ5 పిటిషన్ దాఖలు చేశాయి.
ఏపీ ప్రభుత్వంపై రఘురామ విద్వేష ప్రసంగాలను ప్రసారం చేశారన్న నెపంతో ఆ రెండు ఛానెళ్లపై రాజద్రోహం కేసులు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్లో తమ చానెళ్ల పేర్లను చేర్చారని ఆ చానెళ్ల తరఫున దాఖలైన పిటిషన్లలో పేర్కొన్నారు. తమ సంస్థపై, తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. దీంతోపాటు, సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని విన్నవించాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.