ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఈరోజు తన కొత్త పలుకు కాలమ్లో అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీలో భాగం కాదన్నట్టు జగన్ ప్రవర్తిస్తున్నాడని… రాధాకృష్ణ పేర్కొన్నారు.
మూడేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయలేదని ఒప్పుడు విమర్శించిన జగన్ ప్రపంచ స్థాయి రాజధానికి హామీ ఇవ్వలేదా? హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం ఉన్న ప్రదేశమే రాజధాని అని ఆయన చెప్పలేదా?’’ అని ఆర్కే ప్రశ్నించారు. ఈ క్రమంలో జగన్ కు రాధాకృష్ణ ఒక కొత్త పేరు పెట్టారు. జగన్ ఒక ‘బటన్ బాహుబలి‘ అని వ్యాఖ్యానించారు.
“తండ్రి పాలనను ఉపయోగించి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి జగన్. ఒక్క రూపాయి అప్పు చేయకుండా 2000 కోట్ల మీడియా సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. అమరావతి సాధ్యం కాదని చెప్పడం కేవలం ఉద్దేశపూర్వకంగానే, కక్షపూరితంగా పెట్టుకున్న లక్ష్యం‘‘ అని అన్నారు.
అమరావతికి రూపాయి ఖర్చు పెట్టినా చంద్రబాబు కలను తాను నిజం చేసినట్టు అవుతుందని భావించిన జగన్, ఎట్టి పరిస్థితుల్లోను అది జరగకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోందన్నారు. మూడు రాజధానులు కట్టే ఉద్దేశం లేకపోయినా అమరావతిని కట్టకుండా ఉండేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని స్పష్టమవుతోందని ఆర్కే పేర్కొన్నారు.
అమరావతి వల్ల టీడీపీ మరింత బలపడుతుందని బలంగా నమ్మిన జగన్ కేవలం టీడీపీని ఇబ్బంది పెట్టడం కోసం ఐదు కోట్ల ప్రజలకు రాజధాని లేకుండా చేశారని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.
జగన్ అభిప్రాయం ఎలా ఉన్నా సహజ న్యాయం మరియు న్యాయ వ్యవస్థ సూత్రాలు అమరావతికి అనుకూలంగా ఉన్నాయని, అందుకే హైకోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిందని రాధాకృష్ణ పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు వెలువడిన ఆరు నెలల తర్వాత ఆప్షన్లు లేకపోవటంతో జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్లలోపే సమయం ఉండటంతో ఇకముందు కూడా జగన్ అమరావతిని కట్టరని అందరికీ అర్థమైపోతుందన్నారు.