గత వారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో జరిగిన రాజకీయ చర్చలో భాగంగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి.. అమరావతి జేఏసీ ప్రతినిధి డాక్టర్ శ్రీనివాసరావుల మధ్య జరిగిన రచ్చ తెలిసిందే. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చా కార్యక్రమంలో శ్రీనివాసరావును ఉద్దేశించి ‘పెయిడ్ ఆర్టిస్టు’ అంటూ బీజేపీ నేత విష్ణు వ్యాఖ్య చేయటం.. దీనికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పును విసరటం తెలిసిందే. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.గత వారం ఈ అంశంపై ఏపీ రాజకీయాల్లోజరిగిన లొల్లి తెలిసిందే.
ఈ ఉదంతం తర్వాత చెప్పు విసిరిన శ్రీనివాసరావుపై సదరు చానల్ కేసు పెట్టాలని.. సదరు చానల్ క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పందించలేదు. అందుకు భిన్నంగా తాజాగా తన వీకెండ్ కామెంట్ లో ఆర్కే ఓపెన్ అయ్యారు.లైవ్ లో జరిగిన చెప్పు ఎపిసోడ్ అంశాన్ని ఆయన పేర్కొనటమే కాదు.. ఆ తర్వాత ఏం జరిగింది? తానేం చేశానన్న విషయాన్ని వివరంగా వెల్లడించారు.
ఇంతకీ ఈ ఉదంతంలో ఆర్కే ఏం చేశారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..‘తరగతి గదిలో నన్ను ఎవరో ఏ పూలచొక్కా మూస్కొని కూర్చోరా అని అవమానించారు. లెక్చరర్ వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే’ అని కమెడియన్ సునీల్ డిమాండ్ చేయగా, ‘‘నిన్ను ఎవరో ఏదో అంటే నేను క్షమాపణ చెప్పడం ఏమిటి’’ అని లెక్చరర్ పాత్రధారి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటాడు. ‘నువ్వు–నేను’ సినిమాలోని ఈ సన్నివేశం మాదిరిగానే ‘ఏబీఎన్–ఆంధ్రజ్యోతి’ స్టూడియోలో మూడు రోజుల క్రితం జరిగిన డిబేట్ సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ స్పందించిన తీరు ఉంది.
‘చర్చలో పాల్గొన్న బీజేపీ ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ ప్రతినిధి డాక్టర్ శ్రీనివాసరావు చెప్పు విసిరినందున ఏబీఎన్ యాజమాన్యం, అంటే నేను క్షమాపణ చెప్పాలని, డాక్టర్ శ్రీనివాసరావుపై మేమే కేసు పెట్టాలని సోము వీర్రాజు అండ్ కో డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేవరకు ఏబీఎన్‌ను, ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తామని కూడా బీజేపీ రాష్ట్ర శాఖ పేరిట విడుదలైన ప్రకటనలో హెచ్చరించారు’
‘పత్రికా ప్రమాణాలు, నైతికవిలువలను గాలికొదిలేసినట్టుగా కూడా ఆ పార్టీ మమ్మల్ని నిందించింది. సదరు ప్రకటన సారాంశాన్ని చూసిన పలువురు ‘నువ్వు–నేను’ చిత్రంలోని సన్నివేశాన్ని నాకు ఫార్వర్డ్ చేశారు. చర్చల సందర్భంగా లేదా మరో సందర్భంలోనైనా భౌతికదాడులకు పాల్పడటం తీవ్ర అభ్యంతరకరమే. అలాంటి చర్యలను ఎవరూ సమర్థించరు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితులలో డాక్టర్ శ్రీనివాసరావు చర్యను లక్షలాది మంది నెటిజన్లు సమర్థించడం మాకే ఆశ్చర్యం కలిగించింది.
ఏబీఎన్ స్టూడియోలో ఇటువంటి దురదృష్టకర సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు’‘ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలలో, అనేక చానళ్ల చర్చా కార్యక్రమాలలో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. అయినా, విష్ణువర్ధన్ రెడ్డిపై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన నేను మరుసటి రోజు విష్ణువర్ధన్తో పాటు, డాక్టర్ శ్రీనివాసరావుతో విడివిడిగా మాట్లాడాను. ఇద్దరికీ సమ్మతమైతే స్వయంగా నేనే స్టూడియోలో కూర్చుని లైవ్‌లోనే వివాదాన్ని పరిష్కరిస్తానని కూడా చెప్పాను.
ఏ కారణం వల్లనో గానీ విష్ణువర్ధన్ రెడ్డి తాను రాలేనని, శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేస్తే చాలునని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు’‘దీంతో స్టూడియోలో కూర్చుని జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేయడానికి శ్రీనివాసరావు అంగీకరించారు. అయినప్పటికీ సోము వీర్రాజు అధ్యక్షతన పనిచేస్తున్న ఏపీ బీజేపీ మా సంస్థలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. మంచిదే!
శ్రీనివాసరావు చర్యపై అభ్యంతరం ఉంటే కేసు పెట్టవలసింది విష్ణువర్ధన్ రెడ్డి కాగా, కేసు నమోదు చేయించడం మా బాధ్యత అన్నట్టుగా బీజేపీ తన ప్రకటనలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. బీజేపీ తీసుకున్న ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘించి, మాకు నచ్చిన వారిని ఆహ్వానించి, వారిదే పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి, ప్రజలను మోసం చేయాలని చూస్తే ఏబీఎన్‌పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర చర్యలకూ బీజేపీ ఉపక్రమిస్తుందని కూడా ఆ ప్రకటనలో హెచ్చరించారు. మీరు వద్దనుకున్నాక మీ వాళ్లను పిలిచి స్టూడియోలో కూర్చోబెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదు’ అని ఆర్కే ముగించారు.