దేశవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏపీపైన కూడా కన్నేసినట్లుంది. ఢిల్లీలో ఉన్న క్లీన్ ఇమేజీయే ఆప్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు జాతీయ స్ధాయిలో మంచి క్రేజుంది. మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా కేజ్రీవాల్ కు క్లీన్ ఇమేజీయే ఇంతటి క్రేజుకు కారణమైంది. ఢిల్లీని బేస్ చేసుకుని పంజాబ్, గోవా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది.
అయితే పంజాబ్, గోవాలో ఉన్నంత ఊపు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు కనబడటం లేదు. పంజాబ్ లో అయితే అధికారంలోకి రావటం లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవటం ఖాయమని సర్వేలో తేలుతోంది. ఇదే విధంగా గోవాలో కూడా మంచి పోటీనే ఇస్తోంది. ఇక్కడ కూడా కొన్ని సీట్లు సాధిస్తుందనే అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీపైన ఆప్ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో అంటే విద్యాధికులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలపైన ఎక్కువ దృష్టి పెట్టిందట. తిరుపతి, విజయవాడ, నెల్లూరు, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం లాంటి నియోజకవర్గాల్లో దృష్టిని కేంద్రీకరించినట్లు సమాచారం. చాలా కాలంగా ఆప్ జెండాలు రాష్ట్రంలో కనబడుతున్నాయి. అయితే పోటీ విషయంలో ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో క్లీన్ ఇమేజున్న పార్టీలు దాదాపు కనుమరుగైపోతున్నాయి.
ఒకపుడు ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని సీన్ లోకి ఎంటరైన లోక్ సత్తా దెబ్బతినింది. నిజానికి లోక్ సత్తా కంటిన్యూ అయ్యుంటే పరిస్థితి ఎలాగుండేదో. ఇపుడా స్ధానాన్ని ఆప్ భర్తీ చేయాలని అనుకుంటున్నట్లుంది. వైసీపీ, టీడీపీ, జనసేనలపై హోరా హోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో ఆప్ ఎంటరైతే… కచ్చితంగా చీలేది టీడీపీ ఓట్లే. ఎందుకంటే ఆప్ కు ఎవరైనా చదువుకున్న వారే ఓట్లేయాలి. ప్రస్తుతం వారి మద్దతు టీడీపీ వైపే ఉంది. ఈ నేపథ్యంలో ఆప్ కూడా లోక్ సత్తాలాగే టీడీపీ ఓట్లు చీల్చే ప్రమాదం ఉంది.
నోటాకు పడే ఓట్లు కూడా ఆప్ కి పడొచ్చు. ఏది ఏమైనా… ఆప్ విషయంలో తెలుగుదేశం ఒక కన్నేసి ఉంచాలి. ప్రస్తుత తరుణంలో ప్రతి ఓటు కీలకమే. గతంలో ప్రతి విషయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే టీడీపీ నష్టపోతూ వస్తోంది.