దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ… దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మొదలుకొని రామ్ ప్రసాద్ బిస్మిల్ వరకూ..పలువురు స్వాతంత్ర్య సమరయోధులను మోదీ గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో బాపూ మాదిరిగా వారు కూడా సర్వస్వాన్నీ త్యజించారని కొనియాడారు.
దేశ తొలి ప్రధాని నెహ్రూ, దేశాన్ని ఏకతాటిగా నడిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత్ భవిష్యత్‌ను దర్శించిన బాబా సాహెబ్ అంబేద్కర్,,, ఇలాంటి వారినందరినీ ఈరోజు గుర్తుచేసుకోవాలని మోదీ పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి పటిష్టమైన బాటలు వేసేందుకు 100 లక్షల కోట్ల రూపాయల భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికను ‘ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ పేరుతో త్వరలో ప్రారంభిస్తామని మోదీ ప్రకటించారు.
ఏపీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్…ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని, పారదర్శక పాలన అందిస్తున్నామని జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని జగన్ అన్నారు.
తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత గోల్కొండ కోటకు చేరుకున్న కేసీఆర్.. రాణీమహల్ లాన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు
నిన్న సాయంత్రం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి భవన్ నుంచి కోవింద్ ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయెధుల త్యాగాలను మరిచిపోలేమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఒలింపిక్స్ విజేతలను అభినందించిన కోవింద్…వారు దేశానికి గర్వకారణమన్నారు. పార్లమెంటరీ వ్యవస్థపై మన ప్రజాస్వామ్యం వేళ్లూనుకుందని, సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ప్రారంభించడం చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అభివృద్ధి పథంలో ఈ ఘట్టం చిరస్మరనీయంగా మిగిలిపోతుందని కోవింద్ అన్నారు.