అమరావతి విషయంలో వైసీపీ వైఖరి మారడం లేదు. రాజధానిని ఇప్పటికే ఎలాంటి అభివృద్ధి లేకుండా చేశారు. మూడు రాజధా నుల పేరుతో ఇప్పటికే అమరావతి ఉసురు తీశారనే వాదన బలంగా ఉంది. అమరావతే ఉండి ఉంటే.. రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం వచ్చేదని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది.
అంతేకాదు.. ఇటీవల వరకు జగన్ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ సామాజిక వర్గం కూడా జగన్‌పై వ్యతిరేకతను పెంచుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అమరావతి విషయంలో జగన్ వ్యవహారాన్ని ఈ వర్గం కూడా తెరచాటున తప్పు పడుతోంది. పైగా ఇప్పుడు మరింతగా ఇక్కడ విధ్వంసాలు సాగుతుండడంతో అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
“ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అన్నారు. మేం కూడా నమ్మాం. మా పార్టీ లైన్ ప్రకారం మేం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ప్రచారం చేశాం. కానీ, సుప్రీం కోర్టులో వీగిపోయింది. దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదు“ అని జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా మీడియా ముందు వ్యాఖ్యానిస్తున్నారు.
అదేసమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లినా.. దీనిని నిరూపించుకోలేక పోవడం మాకు పెద్ద మైనస్‌గా మారింది. దీనివల్ల.. పార్టీకి మధ్య తరగతి వర్గం సానుభూతి తగ్గి పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అని మరికొందరు వ్యాఖ్యానిస్తు న్నారు.
ఇక, తాజాగా జరుగుతున్న పరిణామాలపై కూడా ఇంకొందరు అసహనం , ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూల్చేస్తున్నారు. ఇది ఏమాత్రం బాగోలేదు. లింగాయపాలెం-ఉద్దండ్రాయునిపాలెం సమీపంలో ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన ఫ్లాట్‌ఫామ్‌ను ధ్వంసం చేశారు.
ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంతంలో అర్ధరాత్రి రహదారులను ధ్వంసం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది మరింతగా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టినట్టే అవుతుంది. ఇలా చేయడం వల్ల మేం సాధించేది ఏంటో మా నాయకులు ఆలోచించాలి! అని ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
వాస్తవానికి జగన్ తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి వరకు సమర్ధించిన కొందరు వైసీపీ నేతలు సైతం సుప్రీం కోర్టు తీర్పు తర్వాత.. ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలానే ఉంటే.. మున్ముందు పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే గుంటూరులో వ్యతిరేకత పెరిగిందని.. స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకున్నంత మాత్రాన వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పలేమని అంటున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. జగన్ వైఖరి మార్చుకోవాలని.. ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటే.. సదరు భూముల వరకు ఆపేసి.. మిగిలిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా.. వైసీపీ ప్రజల అభిమానం చూరగొనొచ్చుకదా! అంటున్నారు. ఏదేమైనా.. సుప్రీం తీర్పు వైసీపీ పై ప్రభావం చూపిందని పరిశీలకులు సైతం చెబుతుండడం గమనార్హం.