ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణ రేపు జరుగుతున్న సంగతి తెలిసిందే. రానున్న కొద్ది నెల్లలో జరగనున్న యూపీ ఎన్నికలతో పాటు.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా తాజా కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. విస్తరణలో దాదాపు ఎనిమిది నుంచి పది మంది వరకు బయటకు పంపిస్తారని.. పలువురికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. యూపీకి చెందిన పలువురు నేతలకు చోటు లభిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కేంద్రమంత్రి వర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా ప్రకటించిన ఎనిమిది రాష్ట్రాలకు గవర్నర్లకు సంబంధించిన ఆసక్తికర అంశం ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి గవర్నర్లుగా అవకాశం లభించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరిస్తున్న బండారు దత్తాత్రేయను హర్యానాకు గవర్నర్ గా ఎంపిక చేశారు. అదే సమయంలో.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓడిన కంభంపాటి హరిబాబుకు తాజాగా గవర్నర్ గిరి దక్కింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు నేతల్ని ఒకే సమయంలో గవర్నర్లుగా నియమించటం ఈ మధ్య కాలంలో ఇదేనని చెబుతున్నారు.
దీంతో.. కేంద్రంలోని మోడీ సర్కారు.. రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే..ప్రస్తుతం కేంద్రమంత్రిగాఉన్న థావర్ చంద్ గెహ్లాట్ ను కర్ణాటక గవర్నర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణకు ఒక రోజు ముందుగా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతానికి భిన్నంగా మోడీ సర్కారు వేగంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది.
కరోనా నేపథ్యంలో విలువైన ఏడాదిన్నర కాలం మహమ్మారి పుణ్యమా సరిపోవటం.. మోడీ సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తల నేపథ్యంలో.. అన్నింటిని ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ల విషయంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
హర్యానా గవర్నర్ – బండారు దత్తాత్రేయ (ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్)
మిజోరం గవర్నర్ – కంభంపాటి హరిబాబు
మధ్యప్రదేశ్ గవర్నర్ – మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ – రాజేంద్ర విశ్వనాథ్
కర్ణాటక గవర్నర్ – థావర్ చంద్ గెహ్లాట్
గోవా గవర్నర్ – శ్రీధరన్ పిళ్లై (ఇప్పటివరకు మిజోరం గవర్నర్)
త్రిపుర గవర్నర్ – సత్యదేవ్ నారాయణ్ (ఇప్పటివరకు హర్యానా గవర్నర్)
జార్ఖండ్ గవర్నర్ – రమేశ్ బైస్ (ఇప్పటివరకు త్రిపుర గవర్నర్)