దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో ప్రధాని మోదీ రాజకీయాలపై మరోసారి ఫోకస్ పెట్టారు. త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, ఆల్రెడీ కొన్ని స్థానాలు ఖాళీ కావడంతో కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు. కేంద్ర మంత్రుల పనితీరు ఆధారంగా మంత్రిమండలిలో భారీగా మార్పులు, చేర్పులు ఉండవచ్చని అనుకుంటున్నారు. 27 మంది పేర్లను ఆల్రెడీ మోదీ పరిశీలించినట్టు తెలుస్తోంది.
తాజాగా జరగనున్న కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం రమేష్, సుజనా చౌదరిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరికి చాన్స్ ఇవ్వాలని మోదీ భావిస్తున్నారట. ఏపీలో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న బీజేపీ పెద్దలు…వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతానికి కూడా ఇది ఉపకరిస్తుందని అనుకుంటున్నారట.
ఇక, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది వేసిన జ్యోతిరాదిత్య సింధియాకు కేబినెట్ హోదా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, అసోం మాజీ సీఎం శర్వానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణెలకు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్య, పౌర విమానయానం, ఆహార శుద్ధి వంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని అంచనా.