ఊరందరిదీ ఒక దారైతే ఉలికిపిట్టదొక దారి అన్న నానుడి…ఏపీ సీఎం జగన్ రెడ్డికి అతికినట్టు సరిపోతుంది. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విధ్వసం పూర్తి కాకుండానే….థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతుంటే….జగన్ మాత్రం జులైలో పరీక్షలు పెడతానంటూ పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరీక్షల రద్దు అంశంపై ఆల్రెడీ ఉద్యమించడం, ఏపీ హైకోర్టు కూడా అక్షింతలు వేయడంతో ఒకసారి జగన్ సర్కార్ వెనక్కు తగ్గింది. ఇక,తాజాగా మరోసారి పరీక్షల పల్లవి అందుకోవడంతో లోకేష్ మరోసారి ఆన్ లైన్లో ఉద్యమం మొదలుపెట్టారు. ఇక, ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. పరీక్షలను నిర్వహించి తీరతామని ఏపీ సర్కార్ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 21 రాష్ట్రాలకు చెందిన బోర్డులు పరీక్షలను రద్దు చేయగా, ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్వహిస్తానంటోందని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించి…ఏ ఒక్క విద్యార్ధి మరణించినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాప్తి తగ్గలేదని, ఈ సమయంలో లక్షలాదిమంది విద్యార్ధులను ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించింది.
5.2 లక్షల మంది విద్యార్దుల కోసం ఒక్కో రూముకు 18మంది చొప్పున 34 వేల రూములు ఏర్పాటు చేశామని సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్ తరఫు న్యాయవాది తెలిపారు.,అయితే, ఆ వేలకొద్ది గదులను సమన్వయం చేయడానికి 15 రోజుల సమయం ఎలా సరిపోతుందని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల సమయంలో థర్డ్ వేవ్ వస్తే ఏంచేస్తారని ప్రశ్నించింది. గురువారం సాయంత్రంలోగా పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.