370 అధికరణంపై అప్పట్లో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చారిత్రక నిర్ణయమని.. దశాబ్దాలకు పైగా సాగుతున్న సమస్యకు మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగింది. పలువురు విశ్లేషకులు మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎందుకు? అనే దానికి ఎవరికి వారు వారిదైన కారణాన్ని చెప్పే పరిస్థితి. మరి.. ఇలాంటి వేళలో జమ్ముకశ్మీర్ లో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయం మీద ఫోకస్ చేసినోళ్లు తక్కువ మంది.
కేంద్రానికి.. ఆ మాటకు వస్తే మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా స్పందించేందుకు ఆ దశలో ఎవరూ ఇష్టపడలేదు. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో గతానికి భిన్నమైన మార్పు ఉంటుందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమైంది.
అయితే.. ఈ అంశంపై యావత్ దేశం స్పందన ఒకలా ఉంటే.. జమ్ముకశ్మీర్ లో మరోలాంటి పరిస్థితి నెలకొంది. మోడీ సర్కారు నిర్ణయాన్ని జమ్ము.. లఢఖ్ ప్రజలు ఆనందంగా స్వాగతిస్తే.. కశ్మీరీ ప్రజానీకం మాత్రం అందుకు భిన్నమైన స్పందనను వ్యక్తం చేశారు. అయితే.. ఈ నిరసనలు పెద్దగా బయటకు రాలేదు.
దీనికి తోడు కశ్మీర్ కు చెందిన పలువురు నేతలు హౌస్ అరెస్టు కావటంతో.. వారేమనుకుంటున్నారన్న విషయం బయటకు రాలేదు. అంచనాలకు భిన్నంగా కశ్మీరీ నేతల హౌస్ అరెస్టు ఏడాదికి పైనే సాగినట్లుగా చెప్పాలి. అనంతరం వారు బయటకు వచ్చిన తర్వాత గుప్కార్ పేరుతో ఒక టీంగా మారారు. అంతకు ముందు వరకు ఉన్న రాజకీయ శత్రుత్వానికి చెల్లుచీటి చెప్పేసి మరీ ఒకటయ్యారు. కశ్మీర్ విషయంలో అందరి మాట ఒక్కటిలా ఉండాలని నిర్ణయించారు. అలానే సాగుతున్నారు.
రాజకీయంగా అనిశ్చితి పరిస్థితి నెలకొనటం.. రాజకీయ ప్రక్రియ మొదలు కాకపోవటం కేంద్రానికి కొత్త గుబులుగా మారింది. తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికి కశ్మీరీ నేతల తీరులో మార్పు రాని పరిస్థితి. ఇదే సమయంలో కరోనా విరుచుకుపడటంతో కశ్మీర్ అంశం పక్కకు వెళ్లింది. ఇలాంటివేళ.. కశ్మీర్ నేతల భేటీకి ప్రధాని మోడీ మొగ్గుచూపటం.. ఆయన నుంచి స్వయంగా ఆహ్వానం రావటంతో రాజకీయ చర్చనీయాంశంగా మారింది.
ఇది జరగటానికి కాస్త ముందు.. కశ్మీర్ పై తమ వైఖరిని కాంగ్రెస్ స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాని పునరుద్దరించాలని కోరింది. అంతేకాదు.. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని సీనియర్ కాంగ్రెస్ ద్విగ్విజయ్ సింగ్ చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నెల 24న ప్రధాని మోడీతో సమావేశానికి కశ్మీరీ నేతలు హాజరవుతారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఈ సమావేశానికి వెళ్లాలా? వద్దా? అన్న విషయంపై కశ్మీరీ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన సమావేశాలు వరుస పెట్టి సాగుతున్నాయి. ఈ సమావేశాలు ఇవాల్టి వరకు సాగుతాయని.. అప్పుడేతుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
ఒకప్పుడు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మెహబూబా ముఫ్తీకి ఆమె పార్టీ (పీడీపీ) నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానించింది. మరోవైపు ఫరూక్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ తమ నేతలతో చర్చలు జరుపుతోంది. మిగిలిన పార్టీల నేతలు ఏం చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. గుప్కార్ డిక్లరేషన్ కింద ఒకే గొడుగు కిందకు వచ్చిన కశ్మీర్ రాజకీయ పార్టీలు మంగళవారం సమావేశం కానున్నాయి.
మోడీతో మీటింగ్ అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నాయి. తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఇందుకు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం కావాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కానీ రాత్రికి కానీ ఒక కీలక ప్రకటన వెలువడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.