భారత్ ను కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆక్సిజన్ కొరత…మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం…వెరసి ప్రతిరోజూ వేలాదిమంది కరోనా కాటుకు బలవుతున్నారు. భారత దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే రెండు సంస్థలున్నప్పటికీ…ఆరు నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు, వ్యాక్సిన్ల కొరతకు కేంద్రం వైఖరే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి.
అయితే, వ్యాక్సిన్ల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్రాలకు కేంద్రం స్వేచ్ఛనివ్వడం లేదని కొందరు సీఎంలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఒకవేళ భారత్ పై పాకిస్థాన్ దాడులు చేస్తే రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలపైకి నెట్టేస్తారా, రాష్ట్రాలనే యుద్ధ ట్యాంకులు కొనమంటారా అంటూ కేంద్రాన్ని కేజ్రీవాల్ కడిగిపారేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
అమ్మ పెట్టదు…అడుక్కుతిననివ్వదు అన్న చందంగా కేంద్రం వ్యాక్సిన్లను కొనదని…అలా అని వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఇలాంటి సమయంలో రాష్ట్రాలపైకి బాధ్యతలను కేంద్రం నెట్టేయడం సబబు కాదని అన్నారు. భారత్‌లో 6 నెలల ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు. భారత్ లో టీకా నిల్వలు పెంచితే, సెకండ్ వేవ్‌ను సమర్థమంతంగా ఎదుర్కొని ఉండేవారమని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. మరి, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.