ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని మోదీ విశ్వప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ లో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇప్పటికే బీజేపీ నేతలపై టీఎంసీ కార్యకర్తలు దాడిచేశారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా అధికార పార్టీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
నారద కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ రవాణా శాఖా మంత్రి ఫిర్హాద్ హకీంతో పాటు మరో మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ కుంభకోణంలో ఫిర్హద్తోపాటు మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీ, సోవన్ చటర్జీల, నాటి తృణమూల్ కాంగ్రెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై ఆరోపణలున్నాయి. దీంతో, ఈ కేసు విచారణకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు.
ఈ క్రమంలో హకీం అరెస్టుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దీదీతోపాటు టీఎంసీ కార్యకర్తలు సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీబీఐ కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారని, తనను కూడా సీబీఐ అరెస్ట్ చేయాలని మమత డిమాండ్ చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ తమ నేతలను అరెస్టు చేసి కక్ష సాధిస్తోందని దీదీ ఆరోపించారు. మంత్రి ఫిర్హాద్ హకీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ నిరసనలపై రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ స్పందించారు. సీబీఐ కార్యాలయంపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకుల్లా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. అక్కడ శాంతిభద్రతలను పునరుద్దరించాల్సిందిగా పోలీసులను గవర్నర్ కోరారు.
2014లో ఓ వ్యక్తి తాను బడా వ్యాపారవేత్తనంటూ… పశ్చిమ బెంగాల్లో పెట్టుబడులు పెడతానంటూ, ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యేను కలిశారు. ఈ నేపధ్యంలో వారికి కొంత డబ్బు ఇచ్చినట్టు ఆడియో టేపులు బయటకు వచ్చి, సంచలనం సృష్టించాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ టేపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 2021 ఎన్నికల్లో బీజేపీ ఓటమితో తాజాగా ఈ టేపుల వ్యవహారం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.