కరోనా పరిస్థితులపై సీఎంలతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ…మన్ కీ బాత్ తరహాలో ఆయన తాను చెప్పాలనుకున్నదే చెబుతున్నారని, సీఎంలకు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశమే ఇవ్వడం లేదని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ విమర్శలు గుప్పించారు. అయితే, సోరెన్ విమర్శలతో ఏ మాత్రం సంబంధం లేని ఏపీ సీఎం జగన్…వాటిపై స్పందించి విమర్శలపాలయ్యాడు.
మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసంటూ జగన్కు జేఎంఎం చురకలంటించింది. తనపై ఉన్న కేసులను కప్పిపుచ్చుకునేందుకే మోడీకి జగ్ మద్దతుపలికారని విమర్శించింది. ఈ నేపథ్యంలోనే జగన్ పై జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. ఇక, ఏపీలో విపక్ష నేతలు జగన్ పై మండిపడుతున్నారు. దేశం మొత్తం మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే జగన్ మాత్రం తనపై కేసుల భయంతో మోడీ తానా అంటే తందానా అంటున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
జాతీయ స్థాయిలో జగన్ రెడ్డి పై పలువురు రాజకీయ నేతలు, మేధావులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీ పరువు మొత్తం ఒక్క ట్వీట్ తో జగన్ తీశారని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మోడీని ప్రసన్నం చేసుకునేందుకు సోరెన్ కు ట్వీట్ చేసిన జగన్….యవ్వారం బెడిసికొట్టడంతో ఏం చేయాలో తెలియని స్థితికి వచ్చారని ఎద్దేవా చేస్తున్నారు.
తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో రేపో మాపో జగన్…తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది అంటాడేమోనని చురకలంటిస్తున్నారు. దారినపోయే కంపను జగన్ నెత్తిన పెట్టుకున్నాడంటూ మరికొందరు వ్యగ్యంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో వేలు పెట్టిన జగన్….తన పరువుతోపాటు తెలుగోడి పరువు కూడా తీశారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు.